లోక్‌సభ డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: కేటీఆర్

లోక్‌సభ డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: కేటీఆర్
  • రాజకీయాలకు అతీతంగా గళమెత్తాలి: మంత్రి కేటీఆర్‌‌

హైదరాబాద్, వెలుగు: 2026 తర్వాత జనాభా ప్రాతిపదికన జరగనున్న లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘‘జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి.. జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉంది. ప్రగతిశీల విధానాలతో ముందుకు పోతున్న దక్షిణాది రాష్ట్రాలకు కొత్త డీలిమిటేషన్‌తో తక్కువ లోక్ సభ స్థానాలు రావడం అన్యాయం, బాధాకరం” అంటూ మంగళవారం ట్వీట్ ​చేశారు. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తులను పట్టించుకోకుండా జనాభా నియంత్రణ చేయని రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు లోక్​సభ సీట్ల పెంపులో లబ్ధి పొందుతున్నాయని, ఇది దురదృష్టకరమని విమర్శించారు. జనాభాను నియంత్రించిన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు ఈరోజు తీవ్రంగా శిక్షలకు గురవుతున్నాయని అన్నారు. ‘‘జాతీయ ఆర్థిక అభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు అసంబద్ధమైన లోక్​సభ డీలిమిటేషన్ విధానం వల్ల భవిష్యత్తులో తమ ప్రాధాన్యత కోల్పోరాదు. తీవ్రమైన అన్యాయానికి గురవుతున్న దక్షిణాది రాష్ట్రాల వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు గళమెత్తాలి” అని కేటీఆర్​ కోరారు.