- సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ
హైదరాబాద్, వెలుగు: సూర్యాపేట జిల్లాలోని మైనింగ్బ్లాక్ల ఈ–-వేలం ప్రక్రియలో అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ ఆరోపించారు. వెంటనే విచారణ జరిపి, వివాదాస్పద టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం ఆయన లేఖ రాశారు. పసుపులబోడు, సైదుల్నామా, సుల్తాన్‌పూర్ మైనింగ్ బ్లాక్‌లలో సుమారు 1,100 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమి ఉన్నప్పటికీ టెండర్ పత్రాల్లో చట్టబద్ధంగా అవసరమైన కీలక వివరాలను పొందుపరచలేదన్నారు.
ముఖ్యంగా మినరల్ బ్లాక్‌ల కచ్చితమైన అక్షాంశ, -రేఖాంశ కోఆర్డినేట్లు, అటవీ కంపార్ట్‌మెంట్ వివరాలు, డీజీపీఎస్సర్వే ధ్రువీకరణ, వివరణాత్మక సర్వే మ్యాపులు, యూటీఎం జియో కోఆర్డినేట్లు, అలాగే మినరల్ ఆక్షన్ రూల్స్–2015, మైన్స్ అండ్ మినరల్స్(డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్–1957 ప్రకారం అవసరమైన సమగ్ర జియోలాజికల్ నివేదికలు వెల్లడించలేదని లేఖలో పేర్కొన్నారు.
న్యాయపరమైన విచారణలు పెండింగ్‌లో ఉన్నా వేలాన్ని ముందుకు తీసుకెళ్లడం, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సూచనలను పట్టించుకోకపోవడం, చట్టపరమైన, పర్యావరణ అనుమతులు పూర్తికాకముందే ప్రిఫర్డ్ బిడ్డర్లను ప్రకటించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని తెలిపారు. సైదుల్నామా బ్లాక్‌కు డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, సుల్తాన్‌పూర్ బ్లాక్‌కు ఎన్సీఎల్ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను ప్రిఫర్డ్ బిడ్డర్లుగా ప్రకటించారని, ఈ సంస్థలు రిజర్వ్డ్ఫారెస్ట్ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ కేసులను ఎదుర్కొంటున్నాయని అన్నారు. అటవీ శాఖ నుంచి తప్పనిసరిగా పొందవలసిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేకుండానే వేలం నిర్వహించినట్లు ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా మైనింగ్ చేపడితే పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని లేఖలో తెలిపారు.
