బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. సోమవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన బీసీ విద్యార్థి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రూ.6 వేల కోట్లుగా ఉన్న బకాయిలు, ఇప్పుడు రూ.8 వేల కోట్లకు చేరాయని విమర్శించారు. బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం సీఎం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదేమోనని వ్యాఖ్యానించారు.
తక్షణమే గత రెండేండ్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ బకాయిల సాధన కోసం ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తరగతులను బహిష్కరించి, కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు నీల వెంకటేశ్, పగిళ్ల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
