- కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్
- ఫాతిమా కాలేజీని ఎందుకు టచ్ చేయడం లేదని నిలదీత
- ఒవైసీ కళ్లలో ఆనందం కోసమే హిందువులను జైల్లో వేశారని ఫైర్
- మూటల కోసమే రాహుల్ వస్తున్నాడని కామెంట్
కామారెడ్డి/కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో పేదల ఇండ్లనుకూలిస్తే.. తాము అదే ఏరియాల్లో బుల్డోజర్లతో పెద్దల ఇండ్లను కూల్చివేస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న కాంగ్రెస్ నేతల ఇండ్లను కూల్చేందుకు బీజేపీ కార్యకర్తలతో బుల్డోజర్లతో తరలివస్తామని, తాడోపేడో తేల్చుకుంటామన్నారు.
శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైతే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిఉంటుందని వ్యాఖ్యానించారు. మంగళవారం కామారెడ్డిలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ప్రశిక్షణ్ మహాభియాన్ పేరిట బీజేపీ జోనల్ స్థాయి లీడర్ల శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. జిల్లా పార్టీ ఆఫీసులో బాన్సువాడ గొడవల్లో బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో సంజయ్ మాట్లాడారు. గొడవతో సంబంధం లేనివారిని కూడా అరెస్టు చేసి జైల్లో వేశారని అన్నారు.
‘‘మూసీ పరిధిలో రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం పెడతామంటూ పేదల ఇండ్లను కూలిస్తే గాంధీ ఆత్మ ఘోషిస్తుంది. గుజరాత్ లో సర్దార్ వల్లబాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రధాని నరేంద్ర మోదీ మన్ననలు పొందితే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం గాంధీ పేరిట పేదల ఉసురు తీసుకుంటున్నాడు. టెన్త్, ఇంటర్ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులపై కనీసం కనికరం కూడా చూపకుండా దుర్మార్గంగా ఖమ్మంలో పేదల ఇండ్లను కూల్చివేశారు.
హైదరాబాద్లో ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదు? ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్తున్న ప్రభుత్వానికి ఖమ్మంలో పేదల ఇండ్లు కూలుస్తున్నప్పుడు అక్కడి విద్యార్థుల భవిష్యత్తుగుర్తుకు రాలేదా?” అని సంజయ్ ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో సహకరించిన ఎంఐఎం మెప్పు పొందేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఒవైసీ కండ్లలో ఆనందం చూసేందుకు బాన్సువాడలో హిందువులపై అక్రమంగా కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు.
రాహుల్.. ఒకసారి ఖమ్మంలో పర్యటించు
గాంధీ కుటుంబానికి రూ.వెయ్యి కోట్లు వసూలు చేసి ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారని, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ఇక్కడకు వచ్చింది శిక్షణ తరగతులకా, లేక మూటల కోసమా అని సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణకు వచ్చిన రాహుల్ మూసీ సుందరీకరణ పేరుతో కూల్చివేయనున్న ఏరియాలు, ఖమ్మంలో భూదాన్ భూముల్లో కూల్చిన ఇండ్ల ప్రాంతంలో పర్యటించాలన్నారు. దాడులు జరిగిన హిందూ దేవాలయాలను కూడా సందర్శించాలన్నారు.
ఇళ్ల నిర్మాణాలకు డబ్బులు అడగొద్దు
ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం డబ్బులు అడగవద్దని, ఇళ్ల యజమానులను ఇబ్బంది పెట్టరాదని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులకు బండి సంజయ్ సూచించారు. బ్రోకర్లు, ఏజెంట్ల ద్వారా లంచాలు తీసుకుని అనుమతి ఇవ్వాలనుకుంటే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రక్షాళనలో భాగంగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి సోమవారం ఉదయం కరీంనగర్ ఎంపీ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో సంజయ్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అధికారులు పారదర్శకతతో పనిచేయాలన్నారు.
‘‘అధికారులు తప్పు చేస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. మీపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోవద్దు. మా బీజేపీ కార్పొరేటర్ల నుంచి ఒత్తిడి రాకుండా నేను చూసుకుంటా. అధికార పార్టీతో అంటకాగుతూ అవినీతికి పాల్పడితే నష్టపోయేది మీరే” అని సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ సిటీలో ప్రస్తుతం ఎన్ని నిర్మాణాలు అక్రమంగా, అనధికారికంగా కొనసాగుతున్నాయో గుర్తించి వాటికి వారం రోజుల్లోపు నోటీసులివ్వాలని ఆదేశించారు. నోటీసులకు సమాధానం ఇవ్వకపోయినా, అక్రమ నిర్మాణాలను కొనసాగించినా డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ ద్వారా కూల్చివేయాలన్నారు. కాగా.. కరీంనగర్లోని ఆసుపత్రులు, మార్కెట్ కూడళ్లలో త్వరలో అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని సంజయ్ వెల్లడించారు.
