కేసీఆర్ సీఎం అయితేనే కష్టాలు తీరుతాయ్.. అప్పుడే పథకాలన్నీ అమలైతయ్: కేటీఆర్

కేసీఆర్ సీఎం అయితేనే కష్టాలు తీరుతాయ్.. అప్పుడే పథకాలన్నీ అమలైతయ్: కేటీఆర్
  •  ఎస్సారెస్పీని నింపే అవకాశమున్నా కేసీఆర్​కు పేరొస్తదనే నీళ్లు ఎత్తిపోయలే
     
  •  నిర్మల్ రైతు గర్జనలో బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

 

నిర్మల్, వెలుగు: ప్రజల కష్టాలు తీరాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలని.. అప్పుడే సంక్షేమ పథకాలన్నీ అమలవుతాయని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్​ అన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను ప్రకృతిపైకి నెట్టేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నిర్మల్ లో బుధవారం సాయంత్రం బీఆర్ఎస్ నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరువు నెలకొనగా ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన సీఎం ఉపన్యాసాలు, నాటకాలతో దృష్టి మరలించే ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల దృష్ట్యా రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేయాలని, మూడు సీజన్ల రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో వేయాలని, డిమాండ్ చేశారు.

బీజేపీ ఎంపీలు అష్టగ్రహాలు

ఇతర రాష్ట్రాలకు కరువు బృందాలను పంపుతున్న   ప్రధాని మోదీ  తెలంగాణకు ఎందుకు పంపడం లేదన్నారు. బీజేపీకి చెందిన 8మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు అష్టగ్రహాలుగా ఉన్నారని, వారు మోదీని రాష్ట్ర పరిస్థితులపై ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. 

మూడేండ్లలో 4.30 లక్షల కోట్ల అప్పులు

రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉందని, ఓ పార్టీ చెప్పులు మోస్తే, మరో పార్టీ సంచులు మోస్తుందని కేటీఆర్​ ధ్వజమెత్తారు. దేశమంతా వదిలించుకున్న కలుపు మొక్క లాంటి కాంగ్రెస్ ను రాష్ట్రంలో ప్రజలు గెలిపించారని, ఇప్పుడు ఆ పార్టీ ని ఎందుకు గెలిపించామని బాధపడుతున్నారన్నారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి తన గడ్డంపై ఎందుకు ఫికర్ పెట్టుకుంటున్నాడో అర్థం కావడం లేదన్నారు. రేవంత్ రెడ్డిలా ఉండాలని రాష్ట్రంలో ఏ ఒక్కరు కోరుకోరని, ఊళ్లల్లో ఆయనను ప్రజలు తిడుతున్న తిట్లు వింటే వేరే వ్యక్తిఎవరైనా బకెట్ నీళ్లలో దూకి చనిపోయేవారని ఎద్దేవా చేశారు. మూడేండ్లలోనే సీఎం రేవంత్ రూ. 4.30 లక్షల కోట్ల అప్పు చేశారని, రాష్ట్రంలో సంక్షేమం ఆగమైందని, అభివృద్ధి నాశనమైందన్నారు. 

ప్రాజెక్టులు, ఎత్తిపోతలపై నిర్లక్ష్యం

ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందువల్లే ప్రస్తుతం నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. కాళేశ్వరం తో పాటు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్, హై లెవెల్ కెనాల్స్​, రివర్స్ పంపింగ్ సిస్టంను  సర్కార్ నిర్లక్ష్యం చేసిందన్నారు.  నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఎల్పీ లీడర్ గా కొనసాగుతున్నప్పటికీ మహిళా నేతలపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడంలేదని, రేవంత్ రెడ్డి పై మాట్లాడే ధైర్యం ఆయనకు లేదని కేటీఆర్​ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని, తిరిగి గులాబీ జెండాను ఎగిరేసేందుకు అండగా నిలవాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బోథ్​ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, నిర్మల్, ఖానాపూర్ నియోజక వర్గాల ఇన్ చార్జీ లు రాం కిషన్ రెడ్డి, జాన్సన్ నాయక్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.