- బీఆర్ఎస్ రెబల్స్‌గా 2020 మున్సిపల్ ఎన్నికల్లో పలువురి గెలుపు
- ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓటమిలోనూ కీలక పాత్ర
- ఈ సారి అదే గుర్తుపైనా తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ
- కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతోపాటు అన్ని మున్సిపాలిటీల్లో బరిలో ఫార్వర్డ్ బ్లాక్
కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో రెబల్స్‌కు లక్కీ సింబల్‌గా మారిన సింహం గుర్తు.. మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో ఉనికిని చాటే అవకాశం కనిపిస్తోంది. తాము నమ్ముకున్న పార్టీ నుంచి టికెట్ వచ్చే పరిస్థితి లేని కొందరు ఇప్పటికే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తే కేటాయించే గుర్తులు.. అంతగా పాపులర్ అయినవి కాకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ సింహం గుర్తు వైపు మొగ్గుచూపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఆ పార్టీ అభ్యర్థులు మెజార్టీ వార్డుల్లో పోటీలో ఉన్నారు.
రాష్ట్ర స్థాయిలో జరిగిన ఒప్పందం మేరకు తెలంగాణ జాగృతి అభ్యర్థులు కూడా.. ఇదే పార్టీ తరఫున బరిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఇతర పార్టీల రెబల్స్‌గా సింహం గుర్తుపై బరిలో నిలిచి కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు చొప్పదండి, జగిత్యాల, పెద్దపల్లి, రాయికల్ మున్సిపాలిటీల్లో పలువురు ప్రాతినిథ్యం వహించారు. అలాగే ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసిన పలువురి అభ్యర్థుల ఓట్లు చీల్చి వారిలో ఓటమిలోనూ ఈ పార్టీ అభ్యర్థులు కీలక పాత్ర పోషించారు. ఈసారి ఎక్కువ సంఖ్యలో ఏఐఎఫ్‌బీ అభ్యర్థులు పోటీలో ఉండడంతో వారిలో ఎందరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఇండిపెండెంట్లు, రెబల్స్ చూపు ఫార్వర్డ్ బ్లాక్ వైపు..
2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రామగుండం 9 మంది, కరీంనగర్ ముగ్గురు కార్పొరేటర్లతోపాటు రాయికల్ మున్సిపాలిటీల్లో ఇద్దరు కౌన్సిలర్లు, జగిత్యాల, చొప్పదండి, పెద్దపల్లి మున్సిపాలిటీల్లో ఒక్కొక్కరు చొప్పున కౌన్సిలర్లుగా ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు గెలుపొందారు. అంతకుముందు 2018లో ఇదే పార్టీ తరఫున రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన అప్పటి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్.. తన అనుచరులను ఏఐఎఫ్‌బీ తరఫున పోటీ చేయించగా 9 మంది గెలిపించుకున్నారు.
సింబల్‌కు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా చాలామంది ఇండిపెండెంట్లు, పార్టీ టికెట్ రాకపోవచ్చనే అనుమానం ఉన్న అభ్యర్థులు సింహం సింబల్ కోసం ఏఐఎఫ్‌బీ పార్టీ పేరుతోనే నామినేషన్లు వేశారు. కాగా తమ పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీలో చేరినవారికే బీఫామ్ ఇస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి వెల్లడించారు. ఈసారి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 39 మంది అభ్యర్థులు ఫార్వర్డ్ బ్లాక్ తరఫున నామినేషన్లు వేయగా వారిలో 32 మందికి పార్టీ బీఫాం ఇచ్చారు. అలాగే రామగుండంలో 45 మంది, జగిత్యాలలో 9 మంది, హుజూరాబాద్‌లో 9 మంది, జమ్మికుంటలో 17 మంది, పెద్దపల్లిలో 30, చొప్పదండిలో 9, వేములవాడ 6, సిరిసిల్ల 20 మంది సింహం గుర్తుపైన పోటీ చేయబోతున్నారు.
సుభాషిజంను ముందుకు తీసుకెళ్తాం
రాష్ట్రంలో రాజకీయాలు అపవిత్ర కలయికలతో కలుషితమయ్యాయి. కరీంనగర్‌లో బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందంతో అభ్యర్థులను పోటీలోకి దించుతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నేతాజీ ఆశయాలైన సోషలిజం, నేషనలిజం మిళితమైన సుభాషిజాన్ని మేం ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం. . అంబటి జోజిరెడ్డి, రాష్ట్ర కన్వీనర్, ఏఐఎఫ్ బీ
