బాలయ్య అభిమానులకు షాక్.. అఖండ 2 రిలీజ్ చేయకూడదని.. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు

బాలయ్య అభిమానులకు షాక్.. అఖండ 2 రిలీజ్ చేయకూడదని.. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు

చెన్నై: అఖండ 2 సినిమా విడుదలపై మద్రాస్ హైకోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. అఖండ 2 సినిమా నిర్మాణ సంస్థ అయిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్కు న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్పై Eros International Media Ltd మద్రాస్ హైకోర్టులో కేసు గెలిచింది.

Eros International Media Ltdకు చెల్లించాల్సిన సుమారు 28 కోట్ల ఆర్బిట్రేషన్‌ అవార్డ్‌ (మధ్యవర్తిత్వ పరిహారం) చెల్లించేంత వరకూ అఖండ 2 సినిమాను విడుదల చేయకూడదని మద్రాస్ హైకోర్టు ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో.. విడుదలకు కొన్ని గంటల ముందు అఖండ2 సినిమా విడుదలకు అనుకోని ఆటంకం ఎదురైంది. జస్టిస్ ఎస్ఎం సుబ్రమణ్యం, జస్టిస్ సి.కుమరప్పన్తో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పు వెలువరించింది.

అక్టోబర్ 30, 2025న Eros International Media Ltd దాఖలు చేసిన పిటిషన్లను అప్పట్లో సింగిల్ జడ్జి ధర్మాసనం కొట్టేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ Eros సంస్థ అప్పీల్కు వెళ్లింది. తాజాగా.. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ వెలువరించిన తీర్పు Eros సంస్థకు అనుకూలంగా రావడంతో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. పూర్తి ఆర్బిట్రల్ అవార్డు మొత్తం 27 కోట్ల 80 లక్షల 18 వేల 13 రూపాయలు.. 14 శాతం వడ్డీ ఈరోస్‌కు చెల్లిస్తేనే సినిమాను విడుదల చేయాలని అఖండ 2 విడుదలకు ముందు మద్రాస్ డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.