
ముంబై: మహారాష్ట్రలో ఆత్యాధునిక తుపాకుల కలకలం రేగింది. రాయ్‌గఢ్ సముద్ర తీరంలో ఏకే 47 రైఫిల్స్, బుల్లెట్లు ఉన్న అనుమానాస్పద బోటు కేంద్ర ఏజెన్సీలు, పోలీసులను పరుగులు పెట్టించింది. అయితే అది విదేశాల నుంచి కొట్టుకు వచ్చిందని, దాని వల్ల ఎలాంటి ముప్పు లేదని అధికారులు ప్రకటించారు. ఈ బోటులో చిక్కుకున్న వాళ్లను గత జూన్‌లో ఒమన్ తీరంలో రెస్క్యూ చేశారని, తర్వాత అది గల్లంతై ఇలా ఒడ్డుకు చేరుకుందని తెలిపారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఒమన్ నుంచి యూరప్ వెళ్తుండగా..
ముంబైకి 190 కిలోమీటర్ల దూరంలో రాయ్‌గఢ్ జిల్లాలోని శ్రీవర్ధన్ ఏరియాలో ఓ బోటును స్థానికులు గురువారం గుర్తించారు. అందులో ఎవరూ లేకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న రాయ్‌గఢ్ ఎస్పీ ఆశోక్ దూదె, ఇతర అధికారులు.. బోటును సోదా చేశారు. అందులో మూడు ఏకే 47 రైఫిల్స్, బుల్లెట్లను గుర్తించారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నదని, అయితే ఎలాంటి ముప్పు లేదని పోలీసులు చెప్పారు. ‘‘ఇది యూకేలో రిజిస్టర్ అయిన బోటు. ఒమన్ నుంచి యూరప్ వెళ్తుండగా.. ఇందులో ఉన్నోళ్లు ఎమర్జెన్సీ కాల్ చేయడంతో జూన్ 26న మస్కట్ సమీపంలో నౌకలు రక్షించాయి. ఈ పడవలో ఏకే సిరీస్‌కు చెందిన కొన్ని చిన్న ఆయుధాలు ఉన్నాయి” అని కోస్ట్ గార్డ్ అధికారులు వివరించారు. ‘‘ఈ బోటు నెమ్మదిగా ముందుకు సాగుతుంది. ఇందులో చిన్నపాటి ఆయుధాలను తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఉంది. అయితే బోటును విడిచి వెళ్లిన వాళ్లు.. ఆయుధాలను తీసుకెళ్లలేకపోయారు” అని తెలిపారు.
బోటు ఆస్ట్రేలియా మహిళది: ఫడ్నవీస్
ఆ బోటు ఆస్ట్రేలియా మహిళకు చెందినదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగా బోటు మునిగిందని, ఇలా రాయ్‌గఢ్ తీరానికి కొట్టుకు వచ్చిందని అసెంబ్లీకి సమాచారమిచ్చారు. కేంద్ర సంస్థలు, పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.