రీల్ కోసం ఉరి.. తాడు బిగుసుకుని మహిళ మృతి

రీల్ కోసం ఉరి.. తాడు బిగుసుకుని మహిళ మృతి
  • యూపీలోని బందా జిల్లాలో ఘటన

లక్నో: రీల్స్ వ్యసనం ఓ మహిళ ప్రాణం తీసింది. ఉరి వేసుకునే సీన్ రికార్డు చేస్తుండగా తాడు నిజంగానే ఆమె గొంతుకకు బిగుసుకుపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌‌లోని బందా జిల్లాలో జరిగింది. బాబెరు పట్టణం కరూయా పుర్వాకు చెందిన మోహిని(27)కి ఇన్‌‌స్టాగ్రామ్ రీల్స్ చేయటం అలవాటు. శుక్రవారం సాయంత్రం ఆమె ఉరి వేసుకునే డ్రామాటిక్ సీన్ షూట్ చేయాలనుకుంది. వెంటనే ఇంట్లోని ఓ గదిలో సీలింగ్ హుక్‌‌కు తాడు కట్టింది. స్టూల్ మీద నిలబడి తాడును మెడలో వేసుకుంది. ఓ చేతితో మొబైల్‌‌ను పట్టుకుని వీడియో రికార్డ్ చేస్తోంది. 

అయితే, హఠాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి కాలు జారడంతో స్టూల్ నుంచి పడిపోయింది. దాంతో తాడు గొంతుకకు బిగుసుకుని కొన్ని సెకన్లలోనే మోహిని చనిపోయింది. కాసేపటికి ఆ గదిలోకి వచ్చిన మోహిని నాలుగేళ్ల కూతురు భయంతో కేకలు వేసింది. పాప అరుపులు విని కుటుంబ సభ్యులు, పక్కింటివాళ్లు వచ్చి మోహినిని కిందకు దించారు. అయితే, అప్పటికే మోహిని మరణించింది. 

మోహిని ఆత్మహత్య చేసుకుందని తొలుత భావించారు.. అయితే, ఆమె మొబైల్‌‌లో రికార్డ్ అయిన వీడియో చూసి రీల్ షూట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు చనిపోయిందని తేలింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మోహిని డెడ్ బాడీని పోస్ట్‌‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఫోన్ లోని రీల్ వీడియో ఆధారంగా మోహిని ప్రమాదవశాత్తు 
చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. మరిన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.