కామన్వెల్త్‌‌ క్రీడల్లో ఝండుకు కాంస్యం.. 130.9 పాయింట్లు సాధించిన పారా వెయిట్‌‌ లిఫ్టర్‌‌

కామన్వెల్త్‌‌ క్రీడల్లో ఝండుకు కాంస్యం.. 130.9 పాయింట్లు సాధించిన పారా వెయిట్‌‌ లిఫ్టర్‌‌
  • అశోక్‌‌ మాలిక్‌‌కు మెడల్‌‌ మిస్‌‌
  • అదిరిన జాదుమణి పంచ్‌‌
  • జిమ్నాస్టిక్స్‌‌ ఫైనల్లో తపన్​, యోగేశ్వర్‌‌


గ్లాస్గో: కామన్వెల్త్‌‌ క్రీడల్లో ఇండియా పతకాల ఖాతా తెరిచింది. మెన్స్‌‌ హెవీ వెయిట్‌‌ పారా పవర్‌‌ లిఫ్టింగ్‌‌లో ఝండు కుమార్‌‌ కాంస్య పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన ఫైనల్లో 190 కేజీల బరువు ఎత్తిన ఝండు 130.9 పాయింట్లు సాధించి మూడో ప్లేస్‌‌లో నిలిచాడు. తొలి రెండు ప్రయత్నాల్లో 181, 190 కేజీలను అవలీలగా ఎత్తాడు.

అయితే మూడో ప్రయత్నంలో 196 కేజీల బరువు ఎత్తడంలో ఫెయిలయ్యాడు. ఇద్రిస్‌‌ రిలువాన్‌‌ (నైజీరియా, 132.8), మాథ్యూ హార్డింగ్‌‌ (131) వరుసగా స్వర్ణం, రజతం నెగ్గారు. ఇండియాకే చెందిన సుధీర్‌‌ (114.1) ఆరో ప్లేస్‌‌తో సరిపెట్టుకున్నాడు. 

పోలియో బారిన పడినా..

బిహార్‌‌లోని నలందా జిల్లాకు చెందిన 28 ఏళ్ల ఝండు ఐదేళ్ల వయసులోనే పోలియో బారినపడ్డాడు. కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులతో కలిసి కూరగాయలు అమ్మాడు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే 2010 నుంచి 2012 మధ్య కాలంలో దేహదారుఢ్యం కోసం బరువులు ఎత్తడం ప్రారంభించాడు.

షాట్‌‌ఫుట్‌‌, జావెలిన్‌‌ త్రోలోనూ ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్‌‌ కాకపోవడంతో పవర్‌‌ లిఫ్టింగ్‌‌ను కెరీర్‌‌గా ఎంచుకున్నాడు. పోషకాహార లోపం అధిగమించేందుకు వీల్‌‌ చైర్‌‌ లేకపోయినా 20 కిలో మీటర్లు ప్రయాణించి కూరగాయల వ్యాపారం నిర్వహించాడు. మిత్రుల వద్ద అప్పు చేసి ‘ఈ రిక్షా’ కొనుగోలు చేసినా కొవిడ్‌‌ కారణంగా వ్యాపారం దెబ్బతిన్నది. అయినప్పటికీ ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోని ఝండు కష్టాలన్నింటినీ అధిగమిస్తూ దేశానికి తొలి పతకం అందించాడు. 

‘పతకం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. నా తొలి ఫోన్‌‌ కాల్‌‌ తల్లిదండ్రులకు, చిన్న నాటి నుంచి తనతో పాటు సాధన చేసిన గౌతమ్‌‌ భయ్యాకు చేస్తా. క్రీడల్లో ఇండియా జెండా రెపరెపలాడుతుంటే కలిగిన అనుభూతి మరవలేనిది. చివరి ప్రయత్నంలో రాక్‌‌కు బార్‌‌ బెల్స్‌‌ తగలడంతో తప్పు జరిగింది. లేదంటే మరో రికార్డు నమోదు చేసే వాడిని’.
-ఝండు కుమార్‌