జంతర్ మంతర్ వద్ద సంబురాలు...మేం గెలిచామంటూ ప్లకార్డుల ప్రదర్శన

జంతర్ మంతర్ వద్ద సంబురాలు...మేం గెలిచామంటూ ప్లకార్డుల ప్రదర్శన

న్యూఢిల్లీ:  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ ప్రాంతం సంబరాలతో నిండిపోయింది. నీట్ పేపర్ లీక్ అంశంపై గత నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు కొనసాగాయి. ఎట్టకేలకు ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆందోళనకారుల ప్రధాన డిమాండ్ నెరవేరింది. ఈ విజయంతో వందలాది మంది నిరసనకారులు "మేం గెలిచాం" అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జాతీయ జెండాలు పట్టుకుని , ఒకరినొకరు కౌగిలించుకుంటూ, డ్యాన్స్ చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. 

సంబరాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ప్రభుత్వంతో జరిగిన మూడో విడత చర్చలు విజయవంతం కావడంతో తమ నిరసనను తక్షణమే విరమించుకుంటున్నట్లు సీజేపీ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జె.పి. నడ్డా మాట్లాడుతూ.. ఆందోళనకారుల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. ఎవరిపై ఎలాంటి ప్రతీకార చర్యలు ఉండవని స్పష్టం చేశారు. తమ ఉద్యమాన్ని విజయవంతంగా ముగిస్తున్నట్లు సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ కూడా తెలిపారు. నెల రోజులకు పైగా సాగిన పోరాటం ఎట్టకేలకు సఫలం కావడంతో విద్యార్థులు, మద్దతుదారులు తమ ఇళ్లకు పయనమయ్యారు.