ఇది ప్రజాస్వామ్య విజయం..ప్రధాన్ రాజీనామాపై వాంగ్‌‌చుక్ కామెంట్

ఇది ప్రజాస్వామ్య విజయం..ప్రధాన్ రాజీనామాపై వాంగ్‌‌చుక్ కామెంట్

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం ప్రజాస్వామ్య విజయమని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌‌చుక్ అన్నారు. శనివారం ప్రధాన్​ రాజీనామా అనంతరం ఆయన ఎక్స్​వేదికగా స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్య విజయం. నేరుగా వీధుల నుంచే వచ్చిన ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఇది. శాంతి, సహనం, పట్టుదలకు దక్కిన విజయం’ అని ఆయన పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా నెల రోజులకు పైగా నిరసనలకు నాయకత్వం వహించిన దేశపు జెన్- జెడ్ అయిన కాక్రోచ్​జనతా పార్టీకి వాంగ్‌‌చుక్ అభినందనలు తెలిపారు. దేశంలోని నలుమూలల నుంచి ముందుకు వచ్చిన పౌరులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ప్రధాన్ రాజీనామా చేయడంతో చర్చ ‘జవాబుదారీతనం’ నుంచి ‘సంస్కరణల’ వైపు మళ్లుతుందని వాంగ్‌‌చుక్ అన్నారు. సీజేపీ చేపట్టిన నిరసనలో సోనమ్ వాంగ్‌‌చుక్ పాల్గొని గత నెల 28న నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.