జూబ్లీహిల్స్, వెలుగు: భార్యను రోకలి బండతో హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వనపర్తి జిల్లా చింతకుంట గ్రామానికి చెందిన ఆంజనేయులు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌కు చెందిన సరస్వతికి 2013లో పెండ్లి జరిగింది. వీరు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో నివసిస్తున్నారు. ఆంజనేయులు కారు డ్రైవర్‌గా పనిచేస్తుండగా, ఆయన భార్య సరస్వతి హైటెక్ సిటీలో ఓ సంస్థలో హౌస్ కీపర్‌గా పనిచేస్తోంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఆంజనేయుడు వేధింపులు మొదలుపెట్టాడు.
దీంతో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. కొన్ని రోజులకు భార్య వద్దకు వెళ్లిన ఆంజనేయులు కుటుంబసభ్యులతో మాట్లాడి తాను మారిపోయానని చెప్పాడు. ఇకపై బాగా చూసుకుంటానని చెప్పడంతో ఈ నెల 17న తిరిగి సరస్వతి బోరబండకు వచ్చింది. సోమవారం నిద్రిస్తున్న భార్యను రోకలి బండతో కొట్టి చంపేశాడు. ఆ తరువాత ‘నాలో సగ భాగాన్ని చంపేశాను’ అని వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని బోరబండ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
