- కిరాయిదారులు రోడ్లపై చెత్త వేస్తే ఇంటి యజమానులకు ఫైన్
- ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి వార్నింగ్
మల్కాజిగిరి, వెలుగు: బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడైనా చెత్త కనిపిస్తే అది స్వచ్ఛ ఆటో డ్రైవర్ల పనితీరులో లోపంగానే భావిస్తామని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. కిరాయిదారులు రోడ్లపై చెత్త వేస్తే ఇంటి యజమానులకే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మంగళవారం ఆనంద్‌బాగ్ సర్కిల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ఆటో టిప్పర్ డ్రైవర్లతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి అవగాహన కల్పించి రాత్రి వేళల్లో చెత్త వేయకుండా చూడాలని, పాత సామాన్లను కూడా సేకరిస్తూ అవసరమైతే కాలనీ అసోసియేషన్ల సాయం తీసుకోవాలని సూచించారు.
ప్రజల ఆన్లైన్ ఫిర్యాదులను గంటలోపు పరిష్కరించాలని, లేనిపక్షంలో అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మల్కాజిగిరి, మౌలాలీ ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ స్తంభాలు, మట్టి కుప్పలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. గ్రీన్ వేస్ట్ కోసం ప్రత్యేక వాహనాలను వినియోగించుకోవాలని కోరారు. ఏసీ రఘు ప్రసాద్, డీసీ జకియా సుల్తానా, డీఈఈ మహేశ్వర్ తో పాటు పారిశుధ్య సిబ్బంది ఉన్నారు.
