పంచాయతీరాజ్‌‌ శాఖలో ప్రమోషన్ల సందడి!

పంచాయతీరాజ్‌‌ శాఖలో ప్రమోషన్ల సందడి!
  • అన్ని కేడర్లలో పదోన్నతులకు ముమ్మర కసరత్తు
  • ఎంపీడీవోలుగా సూపరింటెండెంట్లు, ఎంపీవోలు 
  • సూపరింటెండెంట్లుగా సీనియర్ అసిస్టెంట్లు 
  • సీనియార్టీ లిస్ట్​ను తయారు చేస్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించనున్నది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంతోపాటు అర్హులైన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కేడర్లలో ప్రమోషన్లు కల్పించేలా కార్యాచరణ రూపొందించారు. కొన్నేళ్లుగా ప్రమోషన్లు ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో ఉద్యోగులు నిరుత్సాహంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఒకేసారి 74 మంది అధికారులకు ప్రమోషన్లు కల్పించారు. ఇందులో మండల స్థాయిలో కీలకంగా వ్యవహరించే 50 మంది ఎంపీడీవోలు, డీపీవోలకు, డిప్యూటీ సీఈవో క్యాడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రమోషన్లు లభించాయి. దీంతో 50 నుంచి 60 ఎంపీడీవో పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 110 వరకు ఎంపీడీవోల పోస్టులు ఖాళీగా ఉండగా.. వీటిని భర్తీ చేసేందుకు ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. అంతేకాదు, రాష్ట్రంలోని 7 జోన్ల పరిధిలో మొత్తం 680 సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 478 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. ఇంకా 202 పోస్టులు భర్తీకి నోచుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200కు పైగా సీనియర్ అసిస్టెంట్లు, 400 మందికిపైగా జూనియర్ అసిస్టెంట్లు ప్రమోషన్లపై ఆశలు పెట్టకున్నారు. 

ఎంపీడీవోలుగా సూపరింటెండెంట్లు, ఎంపీవోలు..

చాలా కాలంగా రాష్ట్రంలో ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్​చార్జిలతో నెట్టుకొస్తున్న సర్కార్.. ఇప్పుడు పర్మినెంట్ పోస్టింగ్స్ పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎంపీవోలుగా పని చేస్తున్న సూపరింటెండెంట్లకు ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తున్నది. సూపరింటెండెంట్లు ఖాళీలైన చోట సీనియర్​ అసిస్టెంట్లకు ప్రమోషన్​ ఇవ్వనున్నారు. గ్రేడ్​–1 కార్యదర్శులకు ఎంపీవోలుగా, సీనియర్ ​అసిస్టెంట్లు ఖాళీలు ఏర్పడిన చోట జూనియర్​ అసిస్టెంట్లకు పదోన్నతి ఇస్తారు.

ఈ మేరకు పంచాయతీరాజ్​ కమిషనరేట్​ ఆఫీసర్లు జిల్లాల్లో ఖాళీల వివరాలతోపాటు సీనియార్టీ జాబితా తెప్పించుకుంటున్నారు. ఏండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న ప్రమోషన్ల ఫైల్ ఇప్పుడు​ కదలడంతో పీఆర్ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్లు లభిస్తే పాలనలో మరింత పారదర్శకత, వేగం పెరుగుతుందని యూనియన్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.