- గ్రామంలో వంద శాతం ఇండ్లకు తాగునీటి సరఫరా
- పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీ నియామకం
- ‘హర్ ఘర్ జల్’ అవార్డుకు ఎంపిక చేసిన కేంద్రం
- నేడు అవార్డు అందుకోనున్న గ్రామ సర్పంచ్
హనుమకొండ/ ఎల్కతుర్తి, వెలుగు: వంద శాతం ఇండ్లకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తుండడంతో హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరెపల్లి గ్రామం జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. పేరుకు చిన్నగ్రామమే అయినా సర్పంచ్ చొరవ, గ్రామస్తుల సమష్టి నిర్ణయాలతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ లో భాగంగా ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడంలో సక్సెస్ అయ్యింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆరెపల్లిని 'హర్ ఘర్ జల్' అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఈ నెల 11న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాష్ట్రపతి, ప్రధాన మంత్రి చేతులమీదుగా అవార్డు అందుకోనున్నారు.
ఎలా ప్రకటిస్తారంటే..
ప్రతి ఇంటికీ నల్లా ద్వారా శుద్ధజలం అందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జల్ శక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలు చేస్తోంది. ఈ పథకాన్ని 2019 ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రమాణాలు పాటించే గ్రామాలను 'హర్ ఘర్ జల్' అవార్డుకు ఎంపిక చేస్తారు. గ్రామంలోని అన్ని ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఉండటంతో ఒక్కొక్కరికీ కనీసం 55 లీటర్ల నీళ్లు అందుతున్నట్లు అధికారులు క్షేత్రస్థాయిలో నిర్ధారించి, పూర్తి నివేదికను సంబంధిత పంచాయతీకి అందజేస్తారు.
అనంతరం గ్రామంలోని అన్ని ఇండ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ సెంటర్లు, ఇతర ఆవాసాలకు నల్లా ద్వారా సరిపడా నీరు అందుతోందని గ్రామసభలో తీర్మానించి, ఆమోదిస్తారు. ఆ తర్వాత ఊరును 'హర్ ఘర్ జల్' సర్టిఫైడ్ గ్రామంగా ప్రకటిస్తారు. గ్రామసభ, నీటి సరఫరా మౌలిక సదుపాయాలను చూపిస్తూ 2 నుంచి 3 నిమిషాల వీడియోను రూరల్ వాటర్ సప్లై ఆఫీసర్లు 'జల్ జీవన్ మిషన్' వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తారు.
నివేదికలు, తీర్మానాలు, వీడియోల ఆధారంగా, జిల్లా అధికారులు పోర్టల్‌లో ఆ గ్రామాన్ని 'సర్టిఫైడ్' గా అప్‌డేట్ చేస్తారు. ఇలా మూడు కేటగిరీల్లో ఎంపికలు జరిపిన తర్వాత జల్ జీవన్ మిషన్ అధికారులు హర్ ఘర్ జల్ అవార్డును ప్రకటిస్తారు.
ఇంటింటికీ శుద్ధజలం..
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఆరెపల్లి గతంలో బావుపేట పంచాయతీ పరిధిలో ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం కొత్త పంచాయతీగా ఏర్పాటు చేసింది. ఇక్కడ మొత్తంగా 80 ఇండ్లు ఉండగా, 370 జనాభా, 272 మంది ఓటర్లున్నారు. కాగా, గ్రామంలో వాటర్ ప్లాంట్ అవసరం లేకుండా ప్రతి ఇంటికీ శుద్ధ నీటిని సప్లై చేసేందుకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఇటీవల గ్రామ పంచాయతీకి కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత సర్పంచ్ పోతరబోయిన స్రవంతి ఆధ్వర్యంలో సురక్షిత తాగునీటి సరఫరా, నిర్వహణ కోసం దాదాపు నెల రోజుల కిందటే విలేజీ వాటర్, శానిటేషన్ కమిటీ (వీడబ్ల్యూఎస్ సీ)ని ఏర్పాటు చేశారు.
ఇందులో సర్పంచ్, ఉప సర్పంచ్, విలేజ్ సెక్రటరీ, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలతో మూడంచెల నీటి సంరక్షణ కమిటీని నియమించారు. అనంతరం మిషన్ భగీరథ నీటిలో ఉండే లవణాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి మూడు నెలలకోసారి గ్రామంలోని ట్యాంక్ లను క్లీన్ చేసేలా ప్రణాళిక రెడీ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన తాగునీరు అందుతుండటంతో ఇటీవల గ్రామసభ నిర్వహించి, తీర్మానం చేశారు. ఆ తర్వాత అధికారులు జల్ జీవన్ మిషన్ లో తమవంతు పాత్రను పోషించారు.
నేడు అవార్డు అందుకోనున్న సర్పంచ్..
ఆరెపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా జల మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు ఊరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నల్లాను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆరెపల్లి 'హర్ ఘర్ జల్' అవార్డుకు ఎంపికైనట్లు ప్రకటించారు. కాగా, హర్ ఘర్ జల్ అవార్డులను బుధవారం ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా సర్పంచ్ లకు అందజేయనున్నారు. దీంతో అవార్డు అందుకునేందుకు గ్రామ సర్పంచ్ పోతరబోయిన స్రవంతితోపాటు అధికారులు ఇప్పటికే ఢిల్లీకి పయనమయ్యారు.
ఇంటింటికీ సురక్షిత నీరు..
మా గ్రామంలో వాటర్ ప్లాంట్లకు ఆస్కారం లేకుండా ప్రతి ఇంటిలో మిషన్ భగీరథ నీటినే ఉపయోగిస్తున్నం. వీడబ్ల్యూఎస్ కమిటీని ఏర్పాటు చేసి, గ్రామస్తులకు సురక్షితమైన నీటిని అందిస్తున్నం. లీకేజీలు, ఇతర సమస్యలు లేకుండా ఇంటింటికీ నీటిని అందించేందుకు కృషి చేస్తున్నం. మా కమిటీ చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.- పోతరబోయిన స్రవంతి, సర్పంచ్, ఆరెపల్లి
