డేటింగ్ యాప్‌లో AI ఖాకీ: పెళ్లి పేరుతో గుజరాతీ భామలను నిండా ముంచిన కేటుగాడు..!

డేటింగ్ యాప్‌లో AI ఖాకీ: పెళ్లి పేరుతో గుజరాతీ భామలను నిండా ముంచిన కేటుగాడు..!

గాంధీ నగర్: ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక పనులు ఎంత వేగంగా జరిగిపోతున్నాయో.. మోసాలు కూడా అదే రేంజ్‎లో పెరిగిపోయాయి. ఏఐ-జనరేటెడ్ ఫోటోలు, వీడియోలు ఉపయోగించి జనాన్ని బురిడి కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుజరాత్‎ రాష్ట్రంలో వెలుగుచూసింది. పోలీస్ అధికారిగా ఫేక్ ఐడీ కార్డ్, ఏఐ-జనరేటెడ్ ఫొటోలతో డేటింగ్, మ్యాట్రిమోనియల్ ప్లాట్‌ఫారమ్‌లలో మహిళలను నమ్మించి మోసం చేస్తున్నాడు ఓ కేటుగాడు. ఓ మహిళా బాధితురాలి ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి రాగా..  అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. 

పోలీసుల వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‎కు చెందిన హిమాంశు అలియాస్ రాకీ పంచల్ షాదీ.కామ్, జీవన్‌సాథి, బంబుల్, హింజ్ వంటి ఇతర ఆన్‌లైన్ డేటింగ్, మ్యాట్రిమోనియల్ ప్లాట్ ఫామ్‎లలో ఫేక్ ఐడీ సృష్టించాడు. ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుని గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెక్యూరిటీ సబ్-ఇన్‌స్పెక్టర్‎గా నకిలీ ఫొటోలు తయారు చేసి ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. 

ఆన్‌లైన్ డేటింగ్, మ్యాట్రిమోనియల్ యాప్‎లలో అమాయక గుజరాత్ మహిళలను టార్గెట్ చేశాడు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి డబ్బులు వసూల్ చేశాడు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌కు చెందిన ఓ మహిళ దగ్గర నుంచి ఇంటి నిర్మాణం కోసమని రూ.80 వేలు దండుకున్నాడు. లోన్ చెల్లించేది ఉందంటూ మరో రూ.60 వేలు వసూల్ చేశాడు. 

హిమాంశు ప్రవర్తనపై అనుమానం వచ్చిన సదరు మహిళ అతడి గురించి ఎంక్వైరీ చేసింది. హిమాంశు అసలు పోలీసే కాదని ఆమెకు షాకింగ్ విషయం తెలిసింది. దీంతో మోసపోయినని గ్రహించిన బాధితురాలు నవ్‌రంగ్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫేక్, ఏఐ ఫొటోలతో మహిళలను చీట్ చేస్తోన్న హిమాంశును అరెస్ట్ చేశారు.