వికారాబాద్ లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నరికి చంపి.. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

వికారాబాద్ లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నరికి చంపి.. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా కొడవలితో  హత్య చేశాడు వేపూరి యాదయ్య అనే  వ్యక్తి. మరో కూతురిని కూడా చంపేందుకు ప్రయత్నించగా ఆ చిన్నారి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది. అనంతరం నిందితుడు యాదయ్య ఇంట్లోనే  ఉరేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు. స్థానికంగా  కలకలం రేపిన ఈ ఘటన నవంబర్ 2న తెల్లవారుజామున జరిగింది.

కుల్కచర్ల  గ్రామంలో అలవేలు, యాదయ్య అనే దంపతులు ఇద్దరు  కూతుళ్లు శ్రావణి, అపర్ణతో  నివాసం ఉంటున్నారు.  రోజువారీ కూళీగా పనిచేసే యాదయ్య..తన  భార్య అలవేలుపై నిత్యం అనుమానం వ్యక్తం చేస్తూ గొడవ పడేవాడని  స్థానికులు  చెబుతున్నారు. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు అతడి వదిన హన్మమ్మ ఇంటికి వచ్చిందంటున్నారు.  ఈ క్రమంలోనే ఇంటికి వచ్చిన వదిన , భార్యా ఇద్దరు కూతుళ్లపై యాదయ్య కొడవలితో దాడి చేసి ఉంటాడని  పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో  భార్య,వదిన, కూతురు చనిపోగా.. మరో కూతురు అపర్ణ తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది. ఈ దారుణ హత్యలు చేసిన అనంతరం యాదయ్య తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

స్థానికుల సమాచారంతో  ఘటనాస్థలాన్ని పరిశీలించిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి హత్యలకు, అతని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు పరిగి డీఎస్పీ.