మందమర్రి బొగ్గు గనుల్లో వందశాతం ఉత్పత్తి : జీఎం ఎన్.రాధాకృష్ణ

మందమర్రి బొగ్గు గనుల్లో వందశాతం ఉత్పత్తి : జీఎం ఎన్.రాధాకృష్ణ

కోల్    బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి గనులు వంద శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ తెలిపారు. గురువారం మందమర్రి జీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ లో ఏరియాలోని గనుల్లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 2,01,500 టన్నులు కాగా, నెలాఖరుకు వంద శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు.

కల్యాణిఖని ఓపెన్    కాస్ట్ గనిలో 1,40,000 టన్నుల లక్ష్యానికి గాను 1,63,123 టన్నులు ఉత్పత్తి చేసి 117 శాతం సాధించగా, కేకే–5 గనిలో 16 వేల టన్నుల లక్ష్యానికి గాను 16,280 టన్నులతో 102 శాతం ఉత్పత్తి నమోదైందన్నారు. కేకే ఓపెన్    కాస్ట్ ప్రాజెక్టులో 24.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీత లక్ష్యానికి గాను 28.70 లక్షల క్యూబిక్ మీటర్లు వెలికితీసి 116 శాతం సాధించినట్లు చెప్పారు. సింగరేణి వ్యాప్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే మందమర్రి ఏరియా బొగ్గు ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. 

విశ్రాంతి సెంటర్లలో ఏసీ..

వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఓపెన్    కాస్ట్ ప్రాజెక్టులలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఏప్రిల్ నెల నుంచి మజ్జిగ సరఫరా చేస్తున్నామని, రెస్ట్​ షెల్టర్లు ఏర్పాటు చేసి ఏసీ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. అలాగే ఓబీ కాంట్రాక్ట్ సంస్థలో పనిచేసే కార్మికులకు మజ్జిగతో పాటు గొడుగులు కూడా అందజేశామని చెప్పారు. ప్రతి రోజు రెండు రైల్వే రేకుల ద్వారా నెలలో మొత్తం 52 రేకుల బొగ్గును రవాణా చేసినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రామకృష్ణాపూర్ ఓపెన్    కాస్ట్ విస్తరణలో భాగంగా రెండో దశ గనిని ప్రారంభించే ప్రణాళిక ఉందని, దీనికి అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉందన్నారు. కాసీపేట–1 గనిలో మ్యాన్    రైడింగ్ వ్యవస్థ వల్ల ఉద్యోగులకు నడక భారం తగ్గిందని, దీంతో బొగ్గు ఉత్పత్తి మరింత పెంచుకునే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో ఏరియా ఇన్    చార్జి ఎస్​వోటూ జీఎం అబ్దుల్ ఖాదీర్, ఇంజినీర్లు బాలాజీ, భగవతి ఝా, డీజీఎంలు అశోక్, కిరణ్    కుమార్ తదితరులు పాల్గొన్నారు.