ఇందన్పల్లి ఇన్చార్జ్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్..ఆదివాసీ యువకులపై దాడి ఘటనలో..

ఇందన్పల్లి ఇన్చార్జ్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్..ఆదివాసీ యువకులపై దాడి ఘటనలో..

జన్నారం, వెలగు: కవ్వాల్ టైగర్ జోన్​లోని మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్ ఇందన్​పల్లి ఫారెస్ట్ ఇన్​చార్జ్ రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్​ ప్రభాకర్ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం ఇందన్ పల్లి పంచాయతీలోని నాయకపుగూడకు చెందిన ఆరుగురు ఆదివాసీ యువకులు సమీప వాగులో చేపలు పడుతుండగా రేంజ్ ఆఫీసర్ తన సిబ్బందితో వెళ్లి యువకులను చితకబాది వారిని అదుపులోకి తీసుకున్నారు. 

విషయం తెలుసుకున్న నాయకపుగూడ ఆదివాసీలు రేంజ్ ఆఫీస్​కు తరలివచ్చి ఆందోళన చేశారు. లక్ష్మీనారాయణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివాసీల వద్దకు వచ్చి ఉన్నతాధికారులతో మాట్లాడారు. యువకులపై దాడి చేసిన రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణను 24 గంటలలోపు సస్పెండ్ చేయాలని లేకపోతే, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. స్పందించిన అధికారులు విచారణ జరిపి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేశారు.