మేడ్చల్, వెలుగు:చెరువుల పునరుద్ధరణ, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెరువుల్లో చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంసీ కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. శుక్రవారం మేడ్చల్ సర్కిల్ పరిధిలో విస్తృతంగా ఆమె పర్యటించారు. మౌలిక సదుపాయాలు, చెరువుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. చెరువుల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తక్షణమే తొలగించాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు.
డ్రైనేజీ లైన్ల డిసిల్టింగ్ పనులు వేగవంతం చేయడంతో పాటు, మేడ్చల్ హైవే- అయోధ్య ఎక్స్ రోడ్స్ మధ్య ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని ఆదేశించారు. వీటితో పాటు యువత కోసం అవుట్డోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, థీమ్ పార్కుల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
