
- బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై చర్చ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డితో ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మంగళవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం ఇంటికి వెళ్లిన ఆమె.. పలు విషయాలపై చర్చించారు.స్టేట్‌లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన అం శంపై మాట్లాడారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్రనేతలు ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో పాటు పార్టీ ఎంపీ, న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీని కలిసి, ఆయన సలహాతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తీరును ఆమెకు సీఎం వివరించారు.
లోకల్ బాడీ ఎన్నికలకు ఎలా వెళ్లాలనే దానిపై తమ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలపై కూడా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో డీసీసీ నియామకాల కోసం ఏఐసీసీ అబ్జర్వర్లు జిల్లాల్లో పర్యటిస్తున్న అంశం, స్థానిక నేతల్లో ఈ పదవి కోసం ఉన్న పోటీపై కూడా చర్చించారు. డీసీసీ నియామకంపై ఏఐసీసీ ఇచ్చిన నిబంధనలను కూడా సీఎంకు మీనాక్షి వివరించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పై కూడా చర్చ జరిగింది. ఇందులో పొన్నం, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలువు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు.