
- మంత్రి దామోదర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశముందని, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఉన్నతాధికారులు జిల్లాలకు వెళ్లి ప్రభుత్వ హాస్పత్రులను సందర్శించాలని ఆదేశించారు. సంగారెడ్డి పర్యటనలో ఉన్న మంత్రి గురువారం హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఇతర ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి, పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్‌మెంట్లను అలర్ట్ చేయాలని ఆదేశించారు.
శానిటేషన్, డైట్ నిర్వహణపై దృష్టి పెట్టండి
ప్రభుత్వ హాస్పిటళ్లలో శానిటేషన్, డైట్ నిర్వాహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు హాస్పిటళ్లలో తనిఖీ చేయాలన్నారు. వార్డులు, వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా లేకపోయినా, పేషెంట్లకు అందించే ఆహారంలో నాణ్యత లోపించినా హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.