- నేడు ప్రారంభించనున్న మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, వెలుగు: గాంధీ హాస్పిటల్ లో కొత్తగా ఏర్పాటు చేసిన స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ శుక్రవారం ప్రారంభించనున్నారు. సుమారు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ సెంటర్ లో లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు, ఎండోకాక్లియర్ ఇంప్లాంట్స్, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించారు.
మొత్తం 6 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, ఆడిటోరియం, 3 ట్రాన్స్‌ప్లాంట్ ఐసొలేషన్ రూములు, 25 బెడ్ల సామర్థ్యంతో 3 ఐసీయూలు, సర్జన్లు, అనస్థీషియా నిపుణుల కోసం స్పెషల్ లాంజ్ లు ఏర్పాటు చేశారు. గాంధీ హాస్పిటల్ లో మదర్ మిల్క్ బ్యాంక్ ను కూడా మంత్రి ప్రారంభించనున్నారు. ఈ సెంటర్ లో తల్లిపాల సేకరణ, స్టోరేజీ కోసం ఏర్పాట్లు చేశారు. అవసరమైన పిల్లలకు వాటిని అందించనున్నారు. ధాత్రి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఈ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ప్రోగ్రాం అనంతరం.. గాంధీ విద్యార్థుల స్నాతకోత్సవంలో మంత్రి పాల్గొంటారు.
