క్షేత్ర స్థాయి అధికారులు స్థానికంగా ఉండాలి

V6 Velugu Posted on Jul 22, 2021

రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు,వరదల కారణంగా జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ కృష్ణభాస్కర్,  ఎస్పీ రాహుల్ హెగ్డే లతో ఫోన్లో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో రెండు, మూడు రోజులు కూడా భారీగా వానలు పడే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో క్షేత్ర స్థాయి అధికారులు  స్థానికంగా ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పొంగి పొర్లుతున్న వాగుల దగ్గర హెచ్చరికలను.. వేరే దారులను సూచించే గుర్తులు ఏర్పాటు చేయాలన్నారు మంత్రి కేటీఆర్.

గ్రామాల్లో పాత ఇండ్లలో ఉన్నవారిని గుర్తించి సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని  ఆదేశించారు. అంతేకాదు.. వర్షకాలంలో గ్రామాల మధ్య ఉన్న చిన్నచిన్న వాగులను దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఎగువ మానేరు జాలశయ నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండి మత్తడి పడిందని.. జలాశయం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు జారీ చేశారు మంత్రి కేటీఆర్. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున వరద పరిస్థితిని సమీక్షించాలన్నారు.

Tagged Minister KTR, rains , field level officials, stay local

Latest Videos

Subscribe Now

More News