పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ప్రభుత్వం భూములు విక్రయిస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన కొట్టిపారేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఐటీఐలకు ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని మంత్రి విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలను సుమారు రూ.8 వేల కోట్లతో అప్గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు.పాలిటెక్నిక్ విద్యపై విద్యార్థులు, లెక్చరర్లలో కొన్ని అపోహలు ఉన్నాయని.. వాటిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల తమ పరిస్థితి ఏమవుతుందోనని కొందరు అధ్యాపకులు ఆందోళన చెందుతున్నారని మంత్రి తెలిపారు.
అయితే ప్రస్తుతం ఉన్న కోర్సులను తొలగించబోమని, వాటితో పాటు అవసరమైన కొత్త కోర్సులను మాత్రమే చేర్చుతామని స్పష్టం చేశారు.విద్యార్థులు, లెక్చరర్లు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు. జీఓ 97లో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎలాంటి ఫీజుల పెంపు ఉండదని స్పష్టం చేశారు.
