
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా మరో నాలుగు రోజుల్లో మిస్ వరల్డ్-2025 అందాల పోటీలు మొదలుకానున్నాయి. 2025, మే 10 నుంచి మే 31 వరకు మిస్ వరల్డ్ 2025 కాంపిటిషన్ జరగనుంది. దీంతో వివిధ దేశాల అందాల భామలు ఒక్కరొక్కరుగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ మెక్సికో మేరీలీ లీల్ సెర్వంటెస్ మంగళవారం (మే 6) హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుతో మర్యాదపూర్వకంగా వీరు భేటీ అయ్యారు.
మిస్ వరల్డ్ కాంపిటిషన్లో పాల్గొనే అందాల భామల రాకతో హైదరాబాద్‌లో ఇప్పటి నుంచే సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు మిస్ వరల్డ్ 2025 పోటీలను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చాలా తక్కువ రాష్ట్రాలకు మాత్రమే లభించే ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టేపడేలా స్వాగత ఏర్పాట్లు చేసింది. "ఆల్ ఐస్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఆన్ తెలంగాణ’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన అందాల భామలు మిస్ వరల్డ్ 2025 కిరీట కోసం పోటీ పడనున్నారు. మిస్ వరల్డ్ పోటీలను గ్రాండ్ సక్సెస్ చేసి.. హైదరాబాద్ పేరు ప్రపంచ దేశాల్లో మోరుమోగేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
ఎవరీ నంది గుప్తా..?
సొంత దేశంలో జరుగుతోన్న మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరుఫున పాల్గొనే అందాల సుందరీ ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. అయితే.. హైదరాబాద్ వేదికగా జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరుఫున 21 ఏళ్ల నందిని గుప్తా ప్రాతినిథ్యం వహించనుంది. రాజస్థాన్‌కు చెందిన నందిని గుప్తా.. 2023, ఏప్రిల్ 15న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2023 పోటీల్లో విజేతగా నిలిచింది. తన ఆకట్టుకునే అందం, అద్భుతమైన తెలివితేటలు, దృడమైన ఆత్మవిశ్వాసంతో న్యాయనిర్ణేతలను మెప్పించి విజేతగా నిలిచింది నందిని గుప్తా. ఈ నేపథ్యంలోనే 72వ మిస్ వరల్డ్ పోటీలకు భారత్ తరుఫున ఎంపికైంది ఈ అందాల భామ.