విచారణకు రాలేను.. ఈడీకి కవిత లేఖ

 విచారణకు రాలేను.. ఈడీకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రాలేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి లేఖ రాశారు. జనవరి 15వ తేదీ సోమవారం కవితకు నాలుగోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. లిక్కర్ పాలసీ  కేసులో జనవరి 16వ తేదీ మంగళవారం డిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపించింది. దీంతో ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తాను విచారణకు హాజరుకాలేనంటూ ఆమె ఈడీకి లేఖ రాసింది. 

 సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ ఉత్తర్వులు ఉన్నాయని... తన కేసు ఇంకా సుప్రీంలో పెండింగ్‌లో ఉందని లేఖలో కవిత తెలిపారు. కాబట్టీ తాను రేపటి విచారణకు రాలేనని లేఖలో స్పష్టం చేసింది.

గతంలో మూడు సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ విచారణ సమయంలో కవిత అరెస్టు అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది.  ఈక్రమంలో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను విచారించిన ఈడీ అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. మహిళలను ఇంటి వద్ద లేదా వీడియో విచారణ జరపాలని తన పిటిషన్‌లో తెలిపింది. దీంతో కవితకు ఊరట లభించింది.  ఇప్పుడు మళ్లీ కవితకు ఈడీ నోటీసులు పంపించింది.  ఇన్ని రోజుల తర్వాత మళ్లీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.