మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సు బాట ఎంఎంటీఎస్ కు టాటా.. ఎంఎంటీఎస్ రైళ్లకు తగ్గుతున్న ప్యాసింజర్లు

మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సు బాట ఎంఎంటీఎస్ కు టాటా..  ఎంఎంటీఎస్ రైళ్లకు తగ్గుతున్న ప్యాసింజర్లు
  •  గతంలో రోజూ లక్షన్నర వరకు ప్రయాణం
  • ఇప్పుడు 60 వేల మంది కూడా ఎక్కుతలేరు
  • 120 నుంచి 88కి తగ్గినరైళ్ల సంఖ్య 
  • మెట్రో, మహాలక్ష్మి స్కీం ఎఫెక్ట్​!

హైదరాబాద్​సిటీ, వెలుగు: రాను రాను ఎంఎంటీఎస్ ​రైళ్లకు ప్యాసింజర్లు తగ్గుతున్నారు. టికెట్ రేట్లు నామమాత్రమే అయినా కొన్ని రూట్లలో ఆలస్యంగా వెళ్తుండడం, ఎక్స్​ప్రెస్​రైళ్లకు రూట్​క్లియర్​చేయడం కోసం ఎక్కడ ఆగుతుందో తెలియకపోవడం, ప్రధాన రూట్లలో మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడం, మహాలక్ష్మి స్కీంతో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి కారణాలతో ఎంఎంటీఎస్​రైళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. దీంతో పదేండ్ల క్రితం రోజుకు లక్షన్నర వరకు ఎంఎంటీఎస్​లో ప్రయాణిస్తే ఇప్పుడు 50 నుంచి 60వేల మంది వరకు మాత్రమే జర్నీ చేస్తున్నారు.  

 గతమెంతో ఘనం

గ్రేటర్​పరిధిలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తక్కువ ఖర్చుతోనే ప్రయాణించడానికి, ప్రజా రవాణాను ప్రోత్సహించడానికి అందరికీ అందుబాటులో ఉండేలా రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మల్టీ మోడల్​ట్రాన్స్​పోర్ట్ సిస్టమ్​(ఎంఎంటీఎస్​)ను 2003లో అందుబాటులోకి తెచ్చారు. మినిమమ్ చార్జి రూ.5 కాగా, మాగ్జిమమ్​రూ.10 తీసుకుంటున్నారు. తక్కువ ధరకే నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండడంతో చాలా మంది ప్రయాణికులు ఆసక్తి చూపించారు. దీంతో ఈ రైళ్లన్నీ కిక్కిరిసిపోయి కనిపించేవి.  

ఎందుకు తగ్గిందంటే..

ఎంఎంటీఎస్​ ఎక్కాలంటే రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది. దిగిన తర్వాత స్టేషన్​ నుంచి బయటకు వచ్చి మళ్లీ బస్సు దొరకబుచ్చుకోవడం వల్ల ఆలస్యం అవుతుండడంతో ప్రయాణికులు ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. 2017లో నగరంలో మెట్రో రైల్​ప్రారంభం కావడంతో అందరూ ఇటు వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. మెట్రో స్టేషన్లు ప్రధాన రహదారులపై ఉండడం, 69 కిలోమీటర్ల మార్గంలో 57 స్టేషన్లు ఉండడం, సగటున 1.21 కిలోమీటర్లకే ఒక స్టేషన్​ఉండడం, తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునే వెసులుబాటు ఉండడంతో అంతా మెట్రో ఎక్కడానికి కారణమైంది. 

పైగా, మెట్రో స్టేషన్ల నుంచి దిగగానే క్యాబ్​ఎక్కే ఫెసిలిటీ ఉండడం, బస్టాప్​లు అందుబాటులో ఉండడంతో ఈ రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. అలాగే, కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమల్లోకి తీసుకువచ్చిన మహాలక్ష్మి స్కీంతో మెట్రోరైళ్లలో ప్రయాణికుల సంఖ్య కొంత తగ్గినా ఎంఎంటీఎస్​కు మాత్రం భారీగా నష్టం కలిగింది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడంతో అత్యధిక శాతం మంది బస్సు ప్రయాణానికే ఆసక్తి చూపిస్తున్నారు. 

ఎంఎంటీఎస్ ​రైళ్ల తగ్గింపు.. రెండో దశకు శ్రీకారం

గ్రేటర్​పరిధిలో గతంలో 120 ఎంఎంటీఎస్​రైళ్లు నడిచేవని, ఇప్పుడు ఈ సంఖ్య 88కి పడిపోయిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు తగ్గుతుండడంతో అధికారులు రైళ్ల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. ఎంఎంటీఎస్​తో ఆదాయం లేకపోగా నష్టాలతో నడుపుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.400 కోట్లు చెల్లించాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వం ఎంఎంటీఎస్ రెండో దశ కొనసాగింపునకు రూ.420 కోట్లతో త్వరలో పనులు చేపట్టబోతోందని అధికారులు తెలిపారు. 

ఘట్​కేసర్​ నుంచి వంగపల్లి (యాదాద్రి) వరకు 38 కి.మీ. ఎంఎంటీఎస్​ సేవల పొడిగింపు పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఉమ్దానగర్​నుంచి మేడ్చల్​ (57 కి.మీ.), రామచంద్రాపురం నుంచి ఘట్​కేసర్​(55 కి.మీ.) నాంపల్లి నుంచి హుస్సేన్​ సాగర్​ వరకు (4కి.మీ.) కలిపి 116 కి.మీ. మేరకు ఎంఎంటీఎస్​ సర్వీసులు కొనసాగుతున్నాయి. ఈ పరిధిలో మొత్తం 53 స్టేషన్లున్నాయి.