హైదరాబాద్, వెలుగు: రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పన కసరత్తును ఆర్థిక శాఖ స్పీడప్ చేసింది. మంగళవారం సెక్రటేరియెట్లో అన్ని శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ కానున్నారు. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి వస్తున్న నిధుల డిమాండ్లు, నూతన ప్రతిపాదనలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించి అంచనాలను బేరీజు వేయనున్నారు.
ఈ కసరత్తు పూర్తయిన అనంతరం మరో మూడు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై ఈ బడ్జెట్ కు తుదిరూపు తీసుకురానున్నారు. ఈ దఫా బడ్జెట్ రూపకల్పనలో ప్రధానంగా వైద్యం, విద్య, ప్రజా సంక్షేమంతో పాటు మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరుసగా ఒక్కో శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం ఈ సమీక్షలు జరుపుతూ కేటాయింపులపై ఒక కొలిక్కి రానున్నారు. సచివాలయంలోని రెండో అంతస్తులో జరగనున్న ఈ సమావేశాలకు సంబంధించి ఆర్థిక శాఖ సవరించిన షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఉదయం 11 గంటలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ప్రారంభమయ్యే ఈ భేటీలు సాయంత్రం హోంశాఖ సమీక్షతో ముగుస్తాయి. మధ్యలో విద్యాశాఖ, కార్మిక, వ్యవసాయ, పంచాయతీరాజ్, రెవెన్యూ, అటవీ, ఎక్సైజ్, పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖల మంత్రులతో విడివిడిగా భేటీలు జరగనున్నాయి. గత బడ్జెట్ లో కేటాయించిన నిధులు, జరిగిన వ్యయం, రాబోయే ఏడాదికి అవసరమైన అదనపు పద్దులపై ఈ సందర్భంగా లోతుగా చర్చించనున్నారు.
ఏ శాఖకు ఎంత కేటాయిస్తే క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుందనే దానిపై అధికారులు పక్కా లెక్కలతో సిద్ధమయ్యారు. మంత్రులతో డిప్యూటీ సీఎం జరిపే ఈ ప్రాథమిక చర్చల నివేదికల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బడ్జెట్ ఫైనల్ డ్రాఫ్ట్ ను పరిశీలిస్తారు. మూడు రోజుల తర్వాత జరిగే ఈ తుది భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ మార్గాల పెంపుపై సీఎం కీలక దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దక్కేలా నిధుల కేటాయింపులో ఏమాత్రం వెనక్కి తగ్గొద్దని ఇప్పటికే సూచించినట్లు తెలిసింది. సంక్షేమంతో పాటే, రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించే మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత దక్కాలని చెప్పినట్లు సమాచారం. వీలైనంత త్వరగా బడ్జెట్ కు సంబంధించిన లాంఛనాలు పూర్తి చేసి, శాసనసభలో ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
