
- మద్దతుగా తరలివచ్చిన ఇండియా కూటమి ఎంపీలు
- ఆహ్వానించినా స్పందించని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్ , వెలుగు: బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించాలన్న డిమాండ్ తో ఢిల్లీలోని జంతర్మంతర్వేదికగా బుధవారం రాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా విజయవంతమైంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్యకర్తలు , బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ నుంచి సుమారు 2వేల మందికి పైగా ప్రతినిధులు అటెండ్ అయ్యారు. ఇండియా కూటమి నేతలు కూడా శిబిరం వద్దకు తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. ధర్నాకు మద్దతుగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చారు. శిబూ సోరెన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జార్ఖండ్వెళ్లడంతో ధర్నాకు రాహుల్‌గాంధీ రాలేకపోయారు. ధర్నాకు మద్దతుగా ఆయన ట్వీట్ చేశారు.
ఇండియా కూటమి ఎంపీల మద్దతు
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలంటూ తెలంగాణ సర్కారు చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమి మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్‌తోపాటు సమాజ్ వాదీ తదితర పార్టీలకు చెందిన సుమారు 100 మంది ఎంపీలు హాజరయ్యారు. ధర్నాకు భారీగా బీసీలు రావడం, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు కూడా సంఘీభావం తెలపడంతో బీసీ రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీ, బీఆర్ఎస్ డుమ్మా
అసెంబ్లీలో బీసీ బిల్లులకు మద్దతు పలికిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కీలక టైమ్‌లో మాత్రం కనిపించలేదు. బిల్లుల ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు పార్టీలకతీతంగా హాజరై మద్దతు తెలపాలని కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఆయన 2 వారాల కిందట్నే ఇట్ల బహిరంగంగా ఆహ్వానించినా.. రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, బీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులెవరూ ధర్నాకు అటెండ్ కాలేదు. బిల్లుల ఆమోదానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. వారూ స్పందించలేదు. బీసీల్లోంచి ముస్లింలను తొలగిస్తేనే బిల్లులకు మద్దతిస్తామని బుధవారం బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ వేర్వేరు ప్రకటనలు ఇచ్చారు.