సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ సొంత వాహనాల్లో వెళ్తున్నారా..?

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ సొంత వాహనాల్లో వెళ్తున్నారా..?

నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్లో అడిషనల్ ఎస్పీ  ప్రెస్ మీట్ నిర్వహించారు. విజయవాడ హైదరాబాద్ రహదారిపై ఉన్న హోటల్ యజమానులకు అడిషనల్ ఎస్పీ కీలక సూచనలు ఇచ్చారు. వాహనదారులు హోటల్ ముందు ఇష్టానుసారంగా రోడ్లపై వెహికల్ పార్కు చేయకుండా హోటల్ సిబ్బంది చూసుకోవాలని హెచ్చరించారు.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో హోటల్స్ ఉండాలని, ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా 100 కాల్ చేయాలని అడిషనల్ ఎస్పీ సూచించారు. పండగకు  సొంత ఊర్లకు వెళ్లే ప్రజలు ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా తమ వెంట తీసుకెళ్లాలని, హోటళ్లకు వచ్చే ప్రయాణికులకు నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని అడిషనల్ ఎస్పీ హోటల్ యజమానులకు తెలిపారు.

►ALSO READ | హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-హైదరాబాద్ మధ్య ఈ తేదీల్లో మరో పది సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్

ఇదిలా ఉండగా.. సంక్రాంతి పండుగ సందర్భంగా నగరం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సొంతూళ్లకు వెళ్తున్నారని, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని యాదాద్రి భువనగిరి ఎస్పీ చెప్పారు. 150 మంది పోలీసులు రెండు షిఫ్ట్ల్లో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. నిన్నటి నుంచి ఇప్పటివరకు 60 వేల వాహనాలు పంతంగి టోల్ ప్లాజా నుంచి రాకపోకలు సాగించాయని వివరించారు. రేపు ఆదివారం కావడంతో రేపటి నుంచి వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. రేపటి నుంచి రోజుకు సుమారు లక్ష వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉందని చెప్పారు. 

జాతీయ రహదారిపై వాహనాలు బ్రేక్ డౌన్ అయితే క్రేన్లను కూడా ఏర్పాటు చేశామని.. అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ సర్వీసులు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పంతంగి టోల్ ప్లాజా 16 లేన్స్ ఉండగా 10 లెన్ల ద్వారా విజయవాడ వైపు వాహనాలను అనుమతిస్తున్నామని, జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని యాదాద్రి భువనగిరి ఎస్పీ స్పష్టం చేశారు.