స్మృతి మందనా రికార్డ్ బ్రేక్ చేసిన జెమీమా.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే WPLలో అరుదైన రికార్డ్

స్మృతి మందనా రికార్డ్ బ్రేక్ చేసిన జెమీమా.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే  WPLలో అరుదైన రికార్డ్

న్యూఢిల్లీ: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL )లో టీమిండియా మహిళా స్టార్ క్రికెటర్, ఢిల్లీ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ అరుదైన ఘనత సాధించింది. డబ్ల్యూపీఎల్‎లో అతి పిన్న వయస్కురాలైన (25 సంవత్సరాల 127 రోజులు) కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ రికార్డ్ స్టార్ ప్లేయర్ స్మృతి మందనా పేరిట ఉండేది. 

26 సంవత్సరాల 230 రోజుల వయసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి స్మృతి నాయకత్వం వహించింది. డబ్ల్యూపీఎల్ సీజన్ 4లో ఢిల్లీ కెప్టెన్‎గా ఎంపిక అవ్వడం ద్వారా స్మృతి రికార్డ్‎ను జెమీమా అధిగమించింది. కాగా, డబ్ల్యూపీఎల్‎ సీజన్ 4లో భాగంగా శనివారం (జనవరి 10) నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై, ఢిల్లీ తలపడ్డాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన డీసీ కెప్టెన్ జెమీమా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 

జెమీమాకు ప్రమోషన్:

2025 వన్డే వరల్డ్ కప్ సెమీస్‏లో ఆస్ట్రేలియాపై అజేయ శతకంతో టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన భారత మహిళా స్టార్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్‎కు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ప్రమోషన్ దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‎గా జెమీమా బాధ్యతలు చేపట్టింది. ఈ సీజన్‎లో ఇండియన్ ప్లేయర్‎ను కెప్టెన్‎గా నియమించాలని ఢిల్లీ మేనేజ్మెంట్ భావించింది. ఇందులో భాగంగానే మెగ్ లానింగ్ స్థానంలో జెమీమాకు డీసీ నాయకత్వ పగ్గాలు దక్కాయి.