న్యూఢిల్లీ: భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ విడాకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం (జనవరి 10) ఓ నేషనల్ మీడియా ఛానెల్ స్పెషల్ షోలో పాల్గొన్న మేరీకోమ్ తన 20 ఏళ్ల వైవాహిక జీవితం, విడాకుల గురించి నోరు విప్పారు. తన మాజీ భర్త కరుంగ్ ఓంఖోలర్ అలియాస్ ఓంలర్ ఒక మోసగాడు, అబద్ధాలకోరు అని అన్నారు. నేను అతన్ని వదిలేయలేదని.. అతనే నన్ను వదిలేశాడని చెప్పారు. ఒక్క రూపాయి కూడా సంపాదించే వాడు కాదని.. ఆడపిల్ల సంపాదనతో బతికేవాడన్నారు.
నాకు తెలియకుండా నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు దొంగలించేవాడని చెప్పారు. ఇలా రెండు సార్లు అతడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని తెలిపారు. పిల్లల పోషణ కోసం అతడు తన ఫుట్‌బాల్ కెరీర్ త్యాగం చేశాడనేది పచ్చి అబద్ధామని.. నిజం చెప్పాలంటే అతడు విధుల్లో ఫుట్ బాల్ ఆడేవాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. అతను నా పేరు మీద అప్పులు కూడా తీసుకున్నాడని.. ఈ విషయం తెలియగానే నాకు వణుకు వచ్చిందన్నారు.
ఇలాంటి వ్యక్తితో జీవించలేక చివరకు విడాకులు తీసుకున్నామని తెలిపారు. తనకు గాయమైనప్పుడే ఈ విషయాలన్ని తెలిశాయని.. బహుశా నా చుట్టూ ఏం జరుగుతుందో నేను గ్రహించేందుకు దేవుడు నన్ను గాయపర్చాడు కావొచ్చన్నారు. అతడు ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ కోసం లాబీయింగ్ చేయాలని నాపై ఒత్తిడి తెచ్చాడని.. దీంతో తాను కొందరు రాజకీయ నాయకులను కలిసి తన భర్తకు టికెట్ ఇవ్వాలని అడిగానని తెలిపారు.
►ALSO READ | స్మృతి మందనా రికార్డ్ బ్రేక్ చేసిన జెమీమా.. ఒక్క మ్యాచ్ ఆడకుండానే WPLలో అరుదైన రికార్డ్
కానీ వారు నాకైతే ఇస్తామన్నారు కానీ తన భర్తకు టికెట్ ఇవ్వలేమని తేల్చిచెప్పారన్నారు. తనకు రాజకీయాలపై అంత ఆసక్తి లేదని చెప్పారు. గత రెండు సంవత్సరాలుగా ఈ విషయాలన్నీ రహస్యంగా ఉంచానన్నారు. నా అభిమానులకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను.. మీరు నాకు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా నిజం ఏదో ఒక రోజు బయటపడుతుందని అన్నారు.
నేను పోరాట యోధురాలినని.. న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. కాగా, బాక్సర్ మేరీ కోమ్, ఆమె భర్త కరుంగ్ ఓంఖోలర్ (ఓన్లర్) 20 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. 2025లో ఈ విషయాన్ని మేరీ కోమ్ అధికారికంగా ధ్రువీకరించారు. 2005లో మేరీకోమ్, కరుంగ్ ఓంఖోలర్ వివాహం చేసుకున్నారు.
