బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా

బ్రాండెడ్ పేర్లతో బియ్యం దందా

గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ సర్కిల్ లోని మైలార్ దేవుపల్లి డివిజన్ పరిధిలో జిల్లా సివిల్ సప్లై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు చేశారు. టాటానగర్ బస్తీలో ఓ బియ్యం గోదాంలో వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో ఎలాంటి పేరులేని పదివేలకు పైగా సోనామసూరి, బాస్మతి బియ్యం బస్తాలను గుర్తించారు. బియ్యం ఎక్కడ నుంచి తెచ్చారని విచారించారు. యజమాని చూపించిన రైస్ బ్యాగ్ ల వివరాలు, బిల్లులు  సరిగా లేవని అధికారులు అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి సాధారణ బియ్యం కొనుగోలు చేసి గోదాంలో వాటిని పాలిష్ చేసి ఖరీదైన మేలురకం బియ్యంగా వివిధ బ్రాండ్లకు సంబంధించిన బస్తాలలో నింపి అమ్ముతున్నట్లుగా అధికారులు గుర్తించారు. 


ముందుగా విజిలెన్స్ అధికారులను లోనికి అనుమతించలేదు. పోలీసుల సాయంలో వారు గోదాంలోని వెళ్లారు. మొత్తం అక్కడ మూడు గోదాంలు ఉండగా.. ఒకే గోదాంను అధికారులకు వారు చూపించారు. వేల సంఖ్యలో బియ్యం బస్తాలు నిల్వ ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన పత్రాలు మాత్రం గోదాంలో లేవు.యజమాని  వీరేందర్ నిల్వలకు సంబంధించిన పత్రాలు మొత్తం ఉన్నాయంటూ తెలిపారు. బిల్లులపై ఏ బ్రాండ్  బియ్యం కొనుగోలు చేశారని డీటేల్స్ లేవు. దీంతో విజిలెన్స్ అధికారులు గోదాంకు సీల్ వేశారు. బియ్యం శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పి శశిధర్ రంగారెడ్డి జిల్లా డిఎస్ఓ మనోహర్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసిల్దార్  రఘునందన్ ఇతర సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.