కేంద్రం కొత్త రూల్: ఇకపై అన్ని బైక్‌లు, స్కూటర్లకి ABSతో పాటు రెండు హెల్మెట్లు ఫ్రీ!

కేంద్రం కొత్త రూల్: ఇకపై అన్ని బైక్‌లు, స్కూటర్లకి ABSతో పాటు రెండు హెల్మెట్లు ఫ్రీ!

కొత్త సంవత్సరం 2026 నుండి ద్విచక్ర వాహనదారుల కోసం ప్రభుత్వం  కొత్త రూల్స్ తీసుకోస్తోంది. దీనివల్ల మీ ప్రయాణం మరింత సేఫ్  అవుతుంది. అయితే ద్విచక్ర వాహనాల ధరలు కూడా కాస్త పెరగవచ్చు. 

వచ్చే ఏడాది  అంటే జనవరి 1 నుండి మీరు కొనే ఏ కొత్త బైక్ లేదా స్కూటర్ అయినా దానికి యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ABS) తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటి వరకు 150cc కంటే ఎక్కువ పవర్ ఉన్న బైక్‌లకే ABS ఉండేది, కానీ ఇకపై చిన్న స్కూటర్ల నుండి పెద్ద బైక్‌ల వరకు అన్నింటికీ ABS ఉండాల్సిందే. దీనితో పాటు, కొత్త వాహనం కొన్నప్పుడు మీకు రెండు హెల్మెట్లు (BIS సర్టిఫైడ్) ఫ్రీగా లభిస్తాయి.

ABS అంటే ఏమిటి?  
సాధారణంగా మనం స్పీడుగా  వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా  బ్రేక్ వేస్తే చక్రాలు జామ్ అయిపోతాయి లేదా లాక్ అవుతాయి. దీనివల్ల వాహనం కంట్రోల్  తప్పి జారి పడిపోతాం. కానీ ABS ఉన్న వాహనాల్లో బ్రేక్ వేసిన చక్రాలు పూర్తిగా ఆగిపోకుండా, సెకన్ల పాటు తిరుగుతూనే ఉంటాయి. దీనివల్ల వాహనం స్కిడ్ అవ్వదు, జారిపోదు. వర్షం పడి రోడ్డు తడిగా ఉన్నప్పుడు లేదా ఎవరైనా ఒక్కసారిగా అనుకోకుండా అడ్డం వచ్చినప్పుడు ABS  ప్రమాదాల నుండి కాపాడుతుంది.

రెండు హెల్మెట్లు ఎందుకు?
భారతదేశంలో జరిగే రోడ్డు ప్రమాద మరణాల్లో 44% ద్విచక్ర వాహనదారులవే ఉంటున్నాయి. తలకు గాయం కావడమే ఇందుకు ప్రధాన కారణం. అందుకే, కేవలం నడిపే వ్యక్తికే కాకుండా, వెనుక కూర్చునే వారికి కూడా భద్రత ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మీరు వాహనం కొన్నప్పుడే కంపెనీ మీకు రెండు BIS సర్టిఫైడ్ హెల్మెట్లను ఇస్తుంది.

రోడ్డు భద్రత పెరిగినట్టే మీ జేబుపై కూడా భారం పడనుంది. ABS టెక్నాలజీ, రెండు నాణ్యమైన హెల్మెట్ల వల్ల  వాహనాల ధరలు సుమారు రూ. 2,000 నుండి రూ. 5,000 వరకు పెరిగే అవకాశం ఉంది.