డిజిటల్ చెల్లింపుల విప్లవంలో భారత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ఈ క్రమంలో యూపీఐ లావాదేవీలు ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో నేటికీ క్యాష్ చెలామణి తన ఆధిపత్యాన్ని అస్సలు కోల్పోలేదు. 'నగదు రహిత సమాజం' దిశగా అడుగులు పడుతున్నా.. దేశంలో కరెన్సీ భౌతిక వినియోగం కూడా అంతే వేగంగా పెరుగుతుండటం గమనార్హం. డిజిటల్ యుగంలోనూ నగదు ఎందుకు 'కింగ్'గా కొనసాగుతుంది.. అసలు ఎక్కడ తేడా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...
నగదుపై ఆధారపడిన రంగాలు:
భారత ఆర్థిక వ్యవస్థలోని నాలుగు ప్రధాన రంగాలు ఇప్పటికీ నగదు లావాదేవీలనే ఎక్కువగా నమ్ముకుంటున్నాయి. మొదటిది రియల్ ఎస్టేట్. సెకండరీ మార్కెట్‌లో ఆస్తుల కొనుగోలు, విక్రయాల సమయంలో రిజిస్ట్రేషన్ విలువను తక్కువగా చూపించి.. మిగిలిన మొత్తాన్ని (దాదాపు 50% పైగా) నగదు రూపంలోనే చెల్లిస్తున్నారు. రెండోది వ్యవసాయం. చాలా మంది రైతులు తమ పంట ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని నగదు రూపంలోనే అందుకోవడానికి ఇష్టపడుతున్నారు. మూడోది అసంఘటిత రంగం. చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో పెట్టుబడులు, లావాదేవీలు మెజారిటీగా నగదు ద్వారానే జరుగుతున్నాయి. నాలుగోది గ్రామాల్లో చిరు వ్యాపారులు నగదుపై ఆధారపడటం.
ALSO READ : కేంద్రం ఊరటనిచ్చినా.. మార్కెట్‌లో వొడఫోన్ ఐడియా స్టాక్ క్రాష్..
డిజిటల్ చెల్లింపుల వేగం తగ్గిందా:
డిజిటల్ చెల్లింపుల వృద్ధి రేటు గత నాలుగేళ్లలో క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2021-22లో యూపీఐ లావాదేవీలు 105% వృద్ధి నమోదు చేయగా.. 2024-25 నాటికి అది 41%కి చేరింది. నెలకు సగటున 20 బిలియన్ల లావాదేవీల వద్ద యూపీఐ వేగం స్థిరపడినట్లు కనిపిస్తోంది. దీనికి భిన్నంగా.. చలామణిలో ఉన్న కరెన్సీ వృద్ధి రేటు 2024 అక్టోబర్ నాటికి 8.58%కి పెరిగింది. దీనికి అర్థం ప్రజలు చిన్న చిన్న అవసరాలకు డిజిటల్ వాడుతున్నా.. పెద్ద చెల్లింపులు చేయడానికి లేదా దాచుకోవడానికి నగదునే వాడుతున్నారు.
స్టేబుల్‌కాయిన్ల ప్రభావం:
అంతర్జాతీయ లావాదేవీల్లో 'క్రిప్టో స్టేబుల్‌కాయిన్స్' వాడకం పెరుగుతోంది. భారతీయులు కూడా విదేశీ చెల్లింపుల కోసం వీటిని ఆశ్రయిస్తున్నారు. ఆర్‌బీఐ వీటిని వ్యతిరేకిస్తున్నప్పటికీ.. హవాలా మార్గాలకు ప్రత్యామ్నాయంగా ఇవి ఎదుగుతున్నాయి. డిజిటల్ రూపాయి అందుబాటులోకి వచ్చినా.. నగదు ఇచ్చే గోప్యత, భద్రత దానిలో ఉండవని భావిస్తున్న ప్రజలు సైలెంట్ గా క్యాష్ ఎంచుకుంటున్నారు.
మెుత్తానికి భారత్ నగదు రహిత చెల్లింపుల దేశంగా మారాలంటే కేవలం సాంకేతికత ఉంటే సరిపోదు. ఆస్తి రిజిస్ట్రేషన్లపై స్టాంప్ డ్యూటీని తగ్గించడం, చిన్న వ్యాపారులకు జీఎస్టీలో వెసులుబాటు కల్పించడం వంటి విధానపరమైన మార్పులు అవసరమని ప్రస్తుత ట్రెండ్స్ నిరూపిస్తున్నాయి. ప్రజలకు నమ్మకం కలిగినప్పుడే డిజిటల్ చెల్లింపుల వైపుకు మళ్లి అన్ని అవసరాలకూ దానిని వాడతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్ను ఇబ్బందులు ఉన్నంత కాలం లేదా నల్లధనం దాచుకోవాల్సిన అవసరం ఉన్నంత వరకు 'క్యాష్' తన కింగ్ హోదాను కొనసాగిస్తూనే ఉంటుంది.
