టెలికాం రంగంలో అగ్రగామిగా ఉన్న వొడఫోన్ ఐడియా (Vi) ఇన్వెస్టర్లకు నేడు భారీ షాక్ తగిలింది. కేంద్ర క్యాబినెట్ సంస్థకు ఊరటనిచ్చే 'ఏజీఆర్ (AGR) బకాయిల ప్యాకేజీ'కి ఆమోదం తెలిపినప్పటికీ.. స్టాక్ మార్కెట్లో మాత్రం షేరు ధర కుప్పకూలింది. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే వొడఫోన్ ఐడియా షేర్లు ఏకంగా 15 శాతానికి పైగా పతనమై 'లోయర్ సర్క్యూట్'ను తాకాయి. గత ఆరు నెలల్లో 45 శాతానికి పైగా లాభపడిన ఈ స్టాక్.. తాజా పరిణామాలతో ఒక్కసారిగా క్రాష్ అయ్యింది.
బకాయిల చెల్లింపులో ఊరట:
కేంద్ర ప్రభుత్వం వొడఫోన్ ఐడియాకు ఉన్న సుమారు రూ.87వేల 695 కోట్ల ఏజీఆర్ బకాయిలపై ఐదేళ్ల పాటు మొరటోరియం అంటే చెల్లింపుల నిలిపివేత విధించింది. ఈ భారీ మొత్తాన్ని తక్షణమే చెల్లించాల్సిన అవసరం లేకుండా.. 2032 నుండి 2041 వరకు 10 ఏళ్ల కాలానికి రీషెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బకాయిలను వచ్చే ఐదేళ్లలో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కంపెనీకి ఇది శ్వాస పీల్చుకునే అవకాశమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ నిర్ణయం వెనుక అసలు కారణం:
వొడఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి ప్రస్తుతం 49 శాతం వాటా ఉంది. ఈ సంస్థ మనుగడ సాగిస్తేనే టెలికాం రంగంలో పోటీ ఉంటుందని.. దాదాపు 19కోట్ల 80 లక్షల మంది వినియోగదారుల ప్రయోజనాలు దెబ్బతినవని కేంద్రం ఈ చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బకాయిల పునఃపరిశీలనకు అనుమతి లభించడం కంపెనీకి పెద్ద ఊరటగా మారింది. అయితే.. పెనాల్టీలు, వడ్డీ మాఫీపై కేంద్రం నుండి ఇంకా స్పష్టత రాకపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగించింది. దీంతో ఈ స్టాక్ ఒక్కసారిగా నష్టాల బాట పట్టింది. మార్కెట్ల ముగింపు సమయంలో షేరు ధర 11.53 శాతం నష్టంతో రూ.10.67వద్ద ఉంది.
వాస్తవానికి బకాయిల రీషెడ్యూలింగ్ అనేది వొడఫోన్ ఐడియా కంపెనీకి కేవలం తాత్కాలిక ఊరట మాత్రమేనని, అసలు అప్పు తగ్గలేదని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ మాఫీపై స్పష్టత లేకపోవడం, భవిష్యత్తులో ఈ అప్పులు భారంగా మారే అవకాశం ఉండటంతో ట్రేడర్లు షేర్లను అమ్మకాలకు మొగ్గు చూపారు. 18వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ.. తన కార్యకలాపాలను మెరుగుపరుచుకుని తిరిగి లాభాల బాటలోకి రావడంపైనే దాని భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే జియో రాక తర్వాత పెరిగిన పోటీ టెలికాం రంగాన్ని అతలాకుతలం చేసిన వేళ కంపెనీ తిరిగి తన పూర్వ వైభవం సంతరించుకుంటుందనే నమ్మకాలు దాదాపుగా కనిపించటం లేదు. అయితే కేంద్రం అందించిన చేయూత కేవలం టెంపరరీ రిలీఫ్ కావటంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు.
