న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ హై అలర్ట్.. అర్థరాత్రి ఒంటి గంట వరకే ఈవెంట్లు.. సాయంత్రం 7 నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్..

న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ హై అలర్ట్.. అర్థరాత్రి ఒంటి గంట వరకే ఈవెంట్లు.. సాయంత్రం 7 నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్..

న్యూ ఇయర్ వేడుకలకు భాగ్యనగరం హైదరాబాద్ సిద్ధమైంది. కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు నగరవాసులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో హై అలర్ట్ విధించారు సిటీ పోలీసులు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో భద్రతా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు హైదరాబాద్ సీపీ సజ్జనార్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సజ్జనార్. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో హై అలర్ట్ విధించామని.. సిటీలో అర్థరాత్రి ఒంటిగంట వరకే ఈవెంట్లకు అనుమతి ఉంటుందని.. ఈవెంట్ ఆర్గనైజర్లు పార్కింగ్ సౌకర్యం  ఉండేలా చూసుకోవాలని అన్నారు.

బుధవారం ( డిసెంబర్ 31 ) రాత్రి 7 గంటల నుంచే సిటీ అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు సజ్జనార్. తాగి వాహనం నడిపితే జరిమానా, లైసెన్స్ రద్దు మాత్రమే కాకుండా జైలు శిక్ష కూడా తప్పదని అన్నారు. బ్యాక్‌డోర్ మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధమని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు సజ్జనార్. 

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని.. పోలీసులు ప్రత్యేక పికెట్స్, మొబైల్  పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు సజ్జనార్. న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని.. సమాజానికి తోడుగా నిలవడమే నిజమైన వేడుక అని అన్నారు సజ్జనార్.

హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ V6 తో మాట్లాడుతూ..

న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని.. సంబరాలు ఆనందం నుండి విషాదం వైపు మళ్లకుండ  జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సిటీ అంతటా డ్రంక్ డ్రైవ్ లు ఉంటాయని తెలిపారు. తాగి వాహనాల నడిపి ప్రమాదాల బారిన పడొద్దని.. ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదని అన్నారు.

సుమారు వంద టీం లతో డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహించనున్నట్లు తెలిపారు శ్రీనివాస్. సిటీలోని ఫ్లై ఓవర్లను రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసి వేయనున్నట్లు తెలిపారు. ఈవెంట్ ఆర్గనైజర్లు పార్కింగ్ సౌకర్యం  ఉండేలా చూసుకోవాలని.. ప్రత్యామ్నాయ డ్రైవర్లను అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.ట్యాంక్ బండ్, ఎన్‌టీఆర్ మార్గ్ పై  ఎలాంటి వాహనాలు అనుమతించమని.. రేసింగ్, సైలెన్సర్లు తీసివేసి వాహనాలను నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలను ఎలాంటి అపశృతి లేకుండా జరుపుకోవాలని అన్నారు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్.