- లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్న ఆరోపణల్లో నిజం లేదు: డీజీపీ శివధర్ రెడ్డి
- నేరాలు 2.33 శాతం, సైబర్‌క్రైమ్స్ 3 శాతం తగ్గాయి
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిపాత్ర ఉన్నా విచారిస్తం
- ప్రాసెస్ పూర్తయిన తర్వాత కాళేశ్వరం కేసుపై సీబీఐ నిర్ణయం ఉంటుందని వెల్లడి
- పోలీస్ వార్షిక నివేదికరిలీజ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. స్టేట్‌లో లా అండ్ ఆర్డర్ అదుపుతప్పిందంటూ వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది నమోదైన కేసుల వివరాలకు సంబంధించిన ‘తెలంగాణ పోలీస్ వార్షిక నివేదిక -2025’ను మంగళవారం ఆయన విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల నేరాలు 2.33 శాతం, సైబర్ క్రైమ్స్ 3 శాతం తగ్గినట్టు తెలిపారు.
2024లో నవంబర్ వరకు 2,34,158 కేసులు నమోదు కాగా.. 2025లో నవంబర్ వరకు 2,28,695 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. మిస్ వరల్డ్ పోటీలు, గ్లోబల్ సమిట్, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మెస్సీ ఈవెంట్ లాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలన్నింటినీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు.
గతంతో పోలిస్తే ఈ ఏడాది దొమ్మి ఘటనలు సహా ఇతర నేరాల్లోనూ తగ్గుదల నమోదైనట్టు వెల్లడించారు. తెలంగాణలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనమని డీజీపీ స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో- పొలిటికల్ లీడర్ల పాత్రపై ఇప్పుడే చెప్పలేం
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరి పాత్ర ఉన్నా విచారిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. కేసు దర్యాప్తు కొన సాగుతున్నదని.. రాజకీయ నాయకుల పాత్ర ఉందా? లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి స్పందించడం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవతవకల కేసును సీబీఐకి పంపించి నాలుగు నెలలు గడిచిందన్నారు.
ప్రాసెస్ పూర్తయిన తరువాత సీబీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ డెడ్‌లైన్ ప్రకారం మార్చి 31 వరకు మావోయిస్టుల సమస్య పరిష్కారానికి రాష్ట్ర పోలీసులు సైతం కృషి చేస్తున్నట్టు తెలిపారు. శాంతిమార్గాన్ని అనుసరిస్తున్నందున తెలంగాణ పోలీసుల ఎదుట పోలీస్ లొంగుబాట్లు పెరిగాయని చెప్పారు. పోలీస్‌శాఖలో అవసరాలకు తగిన విధంగా సిబ్బంది నియామకాలపై ప్రభుత్వ అనుమతి కోరుతున్నట్టు తెలిపారు.
ఖాకీ బుక్కు మాత్రమే ఫాలో అవుతున్నం
తాము ఖాకీ బుక్కును మాత్రమే ఫాలో అవుతున్నామని డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. నయీం కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న భూములు విక్రయించకుండా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయని, కేసు దర్యాప్తు సైతం కొనసాగుతోందని తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పోలీస్ సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
వరంగల్, కోదాడ, నిజామాబాద్, సీఐడీ విభాగంలో పలువురిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కాగా, గత ఏడాది 35.63 శాతం నేరాల్లో శిక్షలు ఖరారు కాగా.. ఈ ఏడాది 38.72 శాతంగా నమోదైందని చెప్పారు. నాలుగు కేసుల్లో కోర్టులు మరణశిక్ష విధించాయని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12,09,782 సీసీటీవీ కెమెరాలు ఉన్నట్టు వార్షిక నివేదికలో పేర్కొన్నారు.
ఈ ఏడాది నమోదైన 98.9 శాతం అత్యాచారం కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వారేనని.. వారిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, ప్రేమికులు, సహ ఉద్యోగులు ఉన్నట్టు వెల్లడించారు. కాగా, అత్యాచార కేసులలో 2024లో 8.81 శాతం కేసులలో నిందితులకు శిక్ష ఖరారు కాగా.. ఈ ఏడాది 11.18 శాతం కేసులలో నిందితులకు శిక్ష ఖరారైంది.
371 మంది సైబర్ నేరగాళ్లు అరెస్టు
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై ఎఫ్‌ఆర్ నమోదు 2 శాతం కాగా.. తెలంగాణలో 24 శాతం నమోదైన్నట్టు డీజీపీ తెలిపారు. మొత్తం 371 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పోలీసుల ఆత్మహత్యలకు కారణమవుతున్న 25 అంశాలను గుర్తించినట్టు సీఐడీ చీఫ్ చారుసిన్హా వెల్లడించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల ద్వారా ఈ ప్రశ్నావళిపై పోలీస్ సిబ్బంది నుంచి వివరాలు సేకరించి, మానసిక స్థితిని అంచనా వేస్తామన్నారు.
ఇందుకు 3 నెలల సమయం ఇచ్చినట్టు తెలిపారు. మహిళా భద్రతపై షార్ట్ ఫిల్మ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేలా ‘ఒక్క నిమిషం మీ జీవితాన్ని మార్చుతుంది’ అన్న థీమ్‌తో నిమిషం నిడివితో షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు డీజీ( లా అండ్ ఆర్డర్) మహేశ్ భగవత్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషబిస్త్, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, అడిషనల్ డీజీలు అనిల్‌కుమార్, చారుసిన్హా, సంజయ్ కుమార్ జైన్, ఐజీలు ఎం.రమేశ్, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
నేరాలకు సంబంధించిన గణాంకాలు
(జనవరి నుంచి నవంబర్ వరకు)
నేరం 2024 2025
హత్యలు 1,181 1,071
అత్యాచారాలు 2,945 2,549
కిడ్నాప్‌లు 1,525 1,145
ఇండ్లలో చోరీలు 25,204 23,455
దోపిడీలు, దొంగతనాలు 761 584
అల్లర్లు 324 186
మోసాలు 33,618 28,394
నమ్మకద్రోహం 701 863
ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు 2,257 2,042
మిస్సింగ్ కేసులు 19,373 22,882
సాధారణ దాడులు 22,031 21,620
ఇతర ఐపీసీ కేసులు 81,194 87,125
