జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటి నిత్యామీనన్ (Nithya Menen) తన సినీ ప్రయాణంలో మరో కీలక ముందడుగు వేసింది. గతేడాది ‘కాదలిక్క నేరమిల్లై’, ‘తలైవన్ తలైవి’, ‘ఇడ్లీ కడై’ వంటి మూడు భిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే నిత్యా ఇప్పుడు నిర్మాతగా మారి కొత్త బాధ్యతలు చేపట్టింది. లేటెస్ట్గా ‘కేయూరి ప్రొడక్షన్స్’ (Keyuri Productions) అనే పేరుతో స్వంత నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో తన నిర్మాణ సంస్థ ఉద్దేశాలను వివరించింది. “కేవలం వ్యాపార లాభాల కోసమే కాదు, కథా బలం ఉన్న సినిమాలు, లోతైన పాత్రలు, సమాజంపై ముద్ర వేసే కథలకు మా బ్యానర్ ప్రాధాన్యం ఇస్తుంది. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు; అది ప్రేక్షకుల హృదయాలకు చేరి భావోద్వేగ అనుబంధాన్ని సృష్టించాలి,” అని ఆమె తెలిపింది.
నటిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి తన ఆలోచన ఇదేనని చెప్పిన నిత్యా, దర్శకురాలు నందిని రెడ్డి చెప్పిన కొన్ని మాటలు తనలో పెద్ద మార్పు తీసుకొచ్చాయని వెల్లడించింది. చిన్న సినిమాలతో సృజనాత్మక స్వేచ్ఛను ఆస్వాదించాలని భావించిన తన ప్రయాణానికి అలా మొదలైంది ఒక మలుపు తీసుకొచ్చిందని పేర్కొంది. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే సృజనాత్మక తపనతో ముందుకు సాగాలని సంకల్పించినట్లు నిత్యా మీనన్ స్పష్టం చేసింది.
‘కేయూరి’ అంటే ఏమిటి?
కేయూరి' (Keyuri) అంటే భూమి లోతుల్లో పుట్టి, రాతితో చెక్కబడి, కాంతిని ప్రేమించే (కాంతిని ఆస్వాదించే/ప్రకాశించే) అని అర్థం. అయితే, ‘కేయూరి’ అనే పదానికి సంస్కృత మూలం ఉంది. ‘కేయూరం’ అంటే చేతికి ధరించే ఒక అలంకారం (బ్రేస్‌లెట్ లేదా ఆభరణం). దానికి స్త్రీలింగ రూపమే ‘కేయూరి’. ఇది శోభ, అందం, విలువ అనే భావాలను సూచిస్తుంది. తన నిర్మాణ సంస్థకు ఈ పేరు పెట్టడం ద్వారా నిత్యా, మంచి కథలు మరియు భావోద్వేగాలతో మెరిసే సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే తన లక్ష్యాన్ని సూచిస్తున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం వ్యాపార దృక్పథం కాకుండా, సమాజంపై ప్రభావం చూపే కథలను తెరపైకి తీసుకురావాలన్న ఆమె నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
