ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలోని 12 కీలక అంశాలు ఇవే..

ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలోని 12 కీలక అంశాలు ఇవే..

హైదరాబాద్: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో దాదాపు 24 ఏండ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న సిద్ధార్థ రెడ్డి నాలుగు వారాల్లో పోలీసుల ముందు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో రాష్ట్ర హైకోర్టు (ఉమ్మడి ఏపీ హైకోర్టు) విధించిన రెండేండ్ల జైలు శిక్షను సమర్థించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ.. 2012, జనవరిలో సిద్ధార్థ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అలాగే ప్రత్యూషపై అత్యాచారం చేసి చంపారని ఆమె తల్లి సరోజినీదేవి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

అప్పటినుంచి14 ఏండ్లుగా ఈ కేసులో17 పర్యాయాలు సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు విన్నది. చివరగా గతేడాది నవంబర్ 19న ఇరు వైపు సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ మన్మోహన్ తోకూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన రెండేండ్ల జైలు శిక్షను సమర్థిస్తున్నట్లు వెల్లడించింది.  ప్రత్యూష మరణానికి సంబంధించి చార్జ్ షీట్లో పొందుపరిచిన మొత్తం 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని తుది తీర్పును వెలువరించింది. ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీలో ఉన్న ఆ 12 కీలక అంశాలు ఇవే..

1. ప్రత్యూషను గొంతు నిలిమి హత్య చేశారనే వాదనకు ఆధారాలు లేవని తేల్చిన సుప్రీంకోర్టు

2. కోర్టుకు సబ్మిట్ చేసిన మెడికల్ రిపోర్టులు, సాక్షుల వాంగ్మూలాలు ప్రకారం ఆమె విషం తీసుకుని చనిపోయినట్లు గుర్తింపు

3. నిందితుడు సిద్ధార్థ రెడ్డి నటి ప్రత్యూషపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రుజువు కాలేదు

4. కేసు విచారణ చాలాకాలం జరిగిన తర్వాత ప్రత్యూషపై హత్య , లైంగిక వేధింపులు జరిగాయనే ఆరోపణలు పరిగణనలోకి తీసుకోవడం కష్ట సాధ్యం 

5. ఈ కేసులో అత్యంత కీలకమైన పోస్ట్ మార్టం రిపోర్ట్పై అభ్యంతరం చెప్పిన సుప్రీంకోర్టు, డాక్టర్ మునిస్వామి సమర్పించిన రిపోర్టు అన్ ప్రొఫెషనల్గా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్య

6. ఈ కేసులో నివేదికను సమర్పించక ముందే, అసంపూర్తి సమాచారాన్ని బయట పెట్టడం వల్ల కేసు దారిమళ్లిందని.. దాని పర్యవసానాలు తీవ్రంగా ఉన్నాయని అభిప్రాయపడిన కోర్టు

7. ఈ కేసులో కీలక సాక్షి నంబర్ 34 వాంగ్మూలం విశ్వసనీయంగా ఉందని, అది తీర్పులో కీలక పాత్ర పోషించిందన్న  ధర్మాసనం 

8. పరిస్థితుల ప్రభావం, సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి

9. కూల్ డ్రింక్లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న డిఫెన్స్ వాదనను తిరస్కరించిన న్యాయస్థానం 

10. ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన 'నొవాక్రాన్'అనే పురుగుల మందును సిద్ధార్డ్  కొనుగోలు చేశాడన్న విషయం రుజువైంది. ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడమే.

11. చెల్లూరు కేసులో ఇచ్చిన తీర్పును ఈ కేసులో అన్వయించుకోలేమని స్పష్టం చేసిన కోర్టు

12. ఇది అత్యంత కీలకమైన అంశం..  ఇద్దరు వ్యక్తులు పరస్పర అంగీకారంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. అందులో ఒకరు చనిపోయి, మరొకదు బతికితే.. చట్ట ప్రకారం బతికున్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు. ఈ చట్టపరమైన అంశం ఆధారంగానే సిద్ధార్ద్ రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది.