ఒకే వ్యక్తి చేతిలో చిక్కిన టాలీవుడ్: ఓటమిపై నిర్మాత చదలవాడ సంచలన కామెంట్స్

ఒకే వ్యక్తి చేతిలో చిక్కిన టాలీవుడ్: ఓటమిపై నిర్మాత చదలవాడ సంచలన కామెంట్స్

ప్రొగ్రెసివ్ ప్యానల్, మన ప్యానెళ్ల మధ్య (డిసెంబర్ 28న) ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ హోరాహోరీ ఎన్నికల్లో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్‌గా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు ఎన్నికయ్యారు. ప్రొగ్రెసివ్ ప్యానల్ మద్దతుతో ఆయన విజయం సాధించారు. మన ప్యానెల్ మద్దతుతో నట్టి కుమార్ ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి పోటీ పడి ఓడిపోయారు. అయితే, ఈ మన ప్యానెల్ తరుపున ప్రముఖ నిర్మాత, చదలవాడ శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించారు.  

ఈ క్రమంలోనే బుధవారం (డిసెంబరు 31న) దీక్ష మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్యానల్ ఓడిపోయిన నేపథ్యంలో మాట్లాడుతూ చిన్న సినిమాలు పరిశ్రమకు ఎంత అవసరమో మరియు కొత్త ప్రతిభావంతులు రావడానికి అవి అంత ఉపయోగపడతాయని చెప్పారు.

చిన్న నిర్మాతలకు ప్రోత్సాహం అవసరం

"చిన్న సినిమా తీస్తే ఎంతో మంది కొత్త ప్రతిభావంతులు పైకొస్తారు. పరిశ్రమకు చిన్న సినిమాలు ఎంతో అవసరం. మనం చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలి" అన్నారు శ్రీనివాసరావు.

ఎన్నికల్లో మన ప్యానల్ ప్రదర్శన.. 

"మనం మా ప్యానెల్ వైపు మూడు సెక్టార్లలో బరిలో నిల్చున్నాం. అయితే గెలిచింది నిర్మాతలు-స్టూడియో సెక్టార్ మాత్రమే. అవతల ప్యానెల్లో చిన్న నిర్మాతలకు మద్దతు లభించింది. అది మనం గుర్తు పెట్టుకోవాలి" అని చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. 

ఒకే వ్యక్తి చేతిలో చిక్కిన టాలీవుడ్.. 

 "గతంలో రామా నాయుడు, కె.ఎస్. రామారావు, అశ్వనీదత్ లాంటి గొప్ప నిర్మాతలు కొత్త ప్రతిభను ఎంకరేజ్ చేసి, పరిశ్రమలో మంచి వాతావరణాన్ని సృష్టించారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఎక్కువగా ఒక వ్యక్తి చేతిలో ఉంది. దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతలు కూడా సినిమాలు తీయలేని పరిస్థితి వచ్చింది" అని శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. 

చిన్న సినిమాల పరిస్థితి.. 

ప్రస్తుతం చిన్న, పెద్ద సినిమాలు విడుదలకు ముందురోజునే ఆగిపోయే పరిస్థితులు వచ్చాయి. ఇదంతా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలని శ్రీనివాస రావు సూచించారు. "రిలీజ్ కు ముందు కూడా సినిమాలు ఎందుకు అగుతున్నాయో చూడాలి. చిన్న నిర్మాతల సినిమాలకు రిలీజ్కు ముందు పెద్ద నిర్మాత ఫాల్స్ ప్రెస్టేజ్కు పోయి ఏడుస్తున్నాడు. ఇలాంటి సమస్యలతో నా వద్దకు చాలా మంది వచ్చి బాధలు పంచుకున్నారు. నిర్మాతలు బాగుండాలి, పరిశ్రమలో మంచి వాతావరణం ఉండాలి" అన్నారు చదలవాడ. 

గాలిలో నడిచే నిర్మాతలకు హీరోల మద్దతు! 

ప్రస్తుతం చాలా వరకు హీరోలు కూడా గాలిలో నడిచే నిర్మాతలకు మాత్రమే డేట్స్ ఇస్తున్నారు. ఈ పద్ధతి మారాలి. గత చరిత్రను గమనించుకోవాలిని శ్రీనివాస రావు అన్నారు. "ఒకప్పుడు కె.ఎస్. రామారావు, ఎం.ఎస్. రాజు లాంటి నిర్మాతలు హీరోలను సృష్టించి, వారిని స్టార్స్గా మార్చారు. కానీ ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు చేయలేకపోతున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బాగుండేలా పరిశ్రమ కృషి చేయాలి. ఒక్కడినే దోచుకుందాం అనుకుంటే, మిమ్మల్ని ఆ దేవుడే చూసుకుంటాడు" అని చదలవాడ సంచలన కామెంట్స్ చేశారు. ఒకే వ్యక్తి చేతిలో చిక్కిన టాలీవుడ్ అనడంతో.. ఆ వ్యక్తి ఎవరై ఉంటారనే సందేహం నెలకొంది. ఈ క్రమంలో చదలవాడ చేసిన ఈ కామెంట్స్పై ఎవరెలా రియాక్ట్ అవుతారో ఆసక్తి ఏర్పడింది.