ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X' అధినేత ఎలాన్ మస్క్.. కంటెంట్ క్రియేటర్లకు ఇచ్చే మెుత్తాన్ని భారీగా పెంచనున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 31న జరిగిన ఒక ఆసక్తికర చర్చలో.. ప్లాట్‌ఫామ్‌లో క్వాలిటీ ఒరిజినల్ కంటెంట్‌ను నిలుపుకోవడానికి క్రియేటర్ల పేఅవుట్స్‌ను గణనీయంగా పెంచాలన్న ప్రతిపాదనకు మస్క్ సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ఉన్న ఏఐ మోడల్స్ ఆన్‌లైన్ సమాచారాన్ని కాపీ చేస్తున్న తరుణంలో.. ఒరిజినల్ కంటెంట్ సృష్టించే వారికి యూట్యూబ్ కంటే మెరుగైన ఆదాయాన్ని అందించడం ద్వారా ప్లాట్‌ఫామ్ ప్రాముఖ్యతను కాపాడుకోవచ్చని మస్క్ అభిప్రాయపడ్డారు.
ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగకుండా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని మస్క్ స్పష్టం చేశారు. కేవలం ఆదాయం కోసం తప్పుడు పద్ధతుల్లో ఎంగేజ్‌మెంట్‌ను పెంచుకునే వారిని అరికట్టేలా ఈ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు మస్క్ తెలిపారు. దీనిపై 'X' ప్రొడక్ట్ హెడ్ నికితా బీర్ స్పందిస్తూ.. దాదాపు 99 శాతం మోసపూరిత కార్యకలాపాలను అరికట్టే కొత్త విధానాన్ని సిద్ధం చేస్తున్నామని, త్వరలోనే దీనిని అమలులోకి తెస్తామని వెల్లడించారు. గతంలో చెల్లింపుల విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి అత్యంత పారదర్శకంగా, కచ్చితంగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
క్రియేటర్లకు ఇచ్చే పేమెంట్ విషయంలో 'X' ప్రస్తుతం వెనుకబడి ఉందని.. యూట్యూబ్ ఈ విషయంలో అద్భుతంగా పని చేస్తోందని మస్క్ స్వయంగా అంగీకరించారు. అందుకే క్రియేటర్లకు ఇచ్చే మొత్తాన్ని పెంచడమే కాకుండా.. కంటెంట్ నాణ్యతను బట్టి పేమెంట్ కేటాయింపును మరింత శాస్త్రీయంగా చేయాలని నిర్ణయించారు. 'X' ప్లాట్‌ఫామ్‌ను ఒక "ఎవ్రీథింగ్ యాప్"గా మార్చాలనే లక్ష్యంలో భాగంగా జర్నలిస్టులు, ఇన్ ఫ్లూయన్లర్లు, వృత్తిపరమైన క్రియేటర్లను ఆకర్షించడానికి ఈ భారీ నగదు ప్రోత్సాహకాలు ఎంతగానో దోహదపడతాయని ఎక్స్ యాజమాన్యం భావిస్తోంది.
ALSO READ : డిజిటల్ యుగంలోనూ రియల్ కింగ్ 'క్యాష్'..
ఈ కొత్త విధానం అమలులోకి వస్తే.. క్రియేటర్లు తమ పోస్టులపై వచ్చే ప్రకటనల ద్వారా భారీ లాభాలను పొందే అవకాశం ఉంటుంది. అయిత, పారితోషికం పొందే అర్హత కోసం క్రియేటర్లు 'X' నిబంధనలను పాటించడంతో పాటు క్వాలిటీ కంటెంట్‌ను మాత్రమే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మోసపూరిత ఖాతాలను, స్పామ్ కంటెంట్‌ను ఏరివేస్తూ, అసలైన సృజనాత్మకతకు పట్టం కట్టడమే ఈ కొత్త మార్పుల ప్రధాన ఉద్దేశ్యం. అంటే ఇకపై కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ మాదిరిగా ఎక్స్ కూడా మంచి పేఔట్స్ అందించనుందని తెలుస్తోంది.
