సమ్మె దెబ్బకు దిగొచ్చిన స్విగ్గీ, జొమాటో.. గిగ్ వర్కర్లకు భారీ క్యాష్ రివార్డ్స్ వర్షం..

సమ్మె దెబ్బకు దిగొచ్చిన స్విగ్గీ, జొమాటో.. గిగ్ వర్కర్లకు భారీ క్యాష్ రివార్డ్స్ వర్షం..

కొత్త ఏడాది వేడుకల వేళ ఫుడ్ అలాగే ఇతర వస్తువులు ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక తీపి కబురు. న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు స్విగ్గీ , జొమాటో రంగం సిద్ధం చేశాయి. డెలివరీ బాయ్స్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గిగ్ వర్కర్లకు భారీ ఆఫర్లు, ఇన్సెంటివ్‌లను ప్రకటించాయి.

డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటల నుండి అర్థరాత్రి 12 గంటల వరకు ఉండే పీక్ అవర్స్‌లో జొమాటో ప్రతి ఆర్డర్‌కు రూ.120 నుండి రూ.150 వరకు అదనపు పే అందిస్తోంది. ఆర్డర్ల రద్దీని బట్టి ఆ ఒక్క రోజే డెలివరీ పార్టనర్లు రూ.3వేల వరకు సంపాదించుకునే అవకాశం కల్పించింది. అంతేకాకుండా ఆర్డర్లను క్యాన్సిల్ చేసినా లేదా నిరాకరించినా విధించే పెనాల్టీలను తాత్కాలికంగా రద్దు చేసింది.

మరోవైపు స్విగ్గీ ఇంకాస్త ముందుకెళ్లి.. డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల మధ్య డెలివరీ వర్కర్లు గరిష్టంగా రూ.10వేల వరకు సంపాదించే ప్లాన్‌ను ప్రకటించింది. న్యూ ఇయర్ ఈవ్‌లో పీక్ అవర్స్ పేమెంట్ కింద ఏకంగా రూ.2వేల వరకు అదనపు ప్రోత్సాహకాన్ని ఆఫర్ చేస్తోంది. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ జెప్టో కూడా తన డెలివరీ భాగస్వాములకు భారీగా ఇన్సెంటివ్‌లను ప్రకటించింది.

తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేకపోవడంపై నిరసనగా గిగ్ వర్కర్ల యూనియన్లు డిసెంబర్ 25, 31 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీలు ఈ ప్రకటన చేసాయి. క్రిస్మస్ రోజున కొన్ని చోట్ల స్వల్ప అంతరాయాలు కలిగినా.. ఆ తర్వాత డెలివరీలు సాధారణ స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు న్యూ ఇయర్ వేళ ఈ సమ్మె ప్రభావం పడకుండా ఉండేందుకే కంపెనీలు ఈ 'మనీ ప్లాన్'ను అమలు చేస్తున్నాయి.

ALSO READ : న్యూ ఇయర్ పార్టీకి బయటి ఫుడ్స్ తో జాగ్రత్త

ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ (2020) ప్రకారం గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తోంది. దీని కింద అగ్రిగేటర్లు తమ వార్షిక టర్నోవర్‌లో 1-2 శాతం నిధులను సోషల్ సెక్యూరిటీ ఫండ్‌కు జమ చేయాల్సి ఉంటుంది. సమ్మే ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్‌లో గత ఐదు రోజులుగా స్విగ్గీ షేరు 3.33 శాతం పడిపోయి రూ.390.55 వద్ద, జొమాటో షేరు 1.96 శాతం తగ్గి రూ.280 వద్ద ట్రేడవుతున్నాయి. మొత్తానికి డెలివరీ సంస్థలు ఇస్తున్న ఈ భారీ ఆఫర్ల వల్ల న్యూ ఇయర్ కస్టమర్లకు అసౌకర్యం కలగకుండా చేయనున్నాయి.