ఒక కార్మికుడు రోజంతా కష్టపడి పనిచేసిన డబ్బు.. ఒక ఉద్యోగి నెల జీతం.. ఎత రిటైర్డ్ ఎంప్లాయ్ జీవితాంతం సంపాదించిన ప్రావిడెంట్ ఫండ్.. ఒక స్టూడెంట్ పాకెట్ మనీ.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా అకౌంట్లలో దాచుకున్న డబ్బును నొక్కేసేందుకు గోతికాడి నక్కల్లా ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూ ఉన్నారు సైబర్ క్రిమినల్స్. ఎప్పుడు దొరుకుతారా.. ఎవరు ఎలా ట్రాప్ లో పడతారా..? అని ఎదురు చూస్తున్న సైబర్ నేరగాళ్లకు న్యూఇయర్ ఒక అవకాశంగా మలచుకునే పనిలో ఉన్నారు.
గ్రీటింగ్స్ రూపంలో మెసేజ్ లు, ఫైల్స్ పంపించి.. ఈజీగా హ్యాక్ చేసి అకౌంట్లను కొల్లగొట్టేందుకు మాస్క్ వేసుకున్న ఇంటర్నెట్ దొంగలు సిద్ధంగా ఉన్నారు. కొత్త సంవత్సరం సంబురంలో పడి.. అసలు విషయం మరిచిపోతే.. అకౌంట్ గుల్ల చేయడం ఖాయమని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
కొత్త సంవత్సరం సందర్భంగా.. హైదరాబాద్ సిటీ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) సంయుక్తంగా అడ్వైజరీ విడుదల చేశారు. వాట్సాప్ లో సర్క్యులేట్ అయ్యే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తో జాగ్రత్తగా హెచ్చరించారు. అందంగా ఆకర్శించే గ్రీటింగ్స్ ను క్లిక్ చేస్తే.. వ్యక్తిగత, ఫైనాన్షియల్ డేటాతో సహా.. బ్యాంకింగ్ యాప్స్ కు సంబంధించిన కీలక వివరాలు సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆఫర్స్ పేరిట గ్రీటింగ్స్.. ఓపెన్ చేస్తే అంతే..
ఇటీవలి కాలంలో ఆన్ లైన్ షాపింగ్, బుకింగ్ చాలా సర్వసాధారణం అయిపోయింది. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి సైట్లలో ఆఫర్స్ కోసం తెగ సెర్చ్ చేస్తుంటాం. అలాంటి ఆఫర్ల పేరున.. గ్రీటింగ్స్ మెసేజెస్ పంపుతూ ఆకర్షిస్తారని హెచ్చరిస్తున్నారు. ప్రాంప్ట్ మెసేజెస్ పంపి.. క్లిక్ చేసి ఆఫర్ చూడమని ఆశపెడతారు. లింక్ క్లిక్ చేయగానే ఫైల్స్ డౌన్ లోడ్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఇలాంటి ఫైల్స్ హానికరమైనవి కూడా ఉంటుంటాయి. ఏపీకే ఫైల్స్ (APK) క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇన్స్‌స్టాల్ అయిపోతాయి. సైలెంట్ గా మొబైల్ లో స్పైవేర్ లా ఉంటూ మన డేటా మొత్తం సైబర్ క్రిమినల్స్ కు చేరవేస్తాయి
వాట్సాప్ లో న్యూఇయర్ స్కామ్ వైరల్:
వాట్సాప్ లో న్యూఇయర్ స్కామ్ వైరల్ గా స్ప్రెడ్ అవుతోందని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ రూపంలో ఉండే గ్రీటింగ్స్.. మాల్ వేర్ డౌన్ లోడ్ అవుతాయని తెలిపారు. గంటల్లోనే ఫోన్ లో ఉన్న సమాచారం మొత్తం లాగేస్తాయని తెలిపారు. ఫోన్ డేటా, బ్యాంకింగ్ యాప్స్ కు సంబంధించిన పూర్తి వివరాలను కొల్లగొట్టేందుకు సైబర్ క్రిమినల్స్ కు మనం చేసే ఒక్క క్లిక్ చాలని అంటున్నారు.
జాగ్రత్తలు ఇవే:
తెలియన నెంబర్ నుంచి గ్రీటింగ్స్ మెసేజెస్ వస్తే క్లిక్ చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు పోలీసులు. తెలిసిన నెంబర్లైనా సరే.. టెక్స్‌ట్ రూపంలో ఉండే మెసేజులు చదివి వదిలెయ్యాలని.. లింక్ ఉండే మెసేజెస్ ఓపెన్ చేయకపోవడమే బెటర్ అంటున్నారు. ఒక్కసారి ఏపీకే ఫైల్ ఇన్‌స్టాల్ అయితే.. బ్యాగ్రౌండ్ లో సాఫ్ట్‌వేర్ దానిపని అది చేసుకుంటుందని.. మనతో సంబంధం లేకుండానే అంతా క్లీనప్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
ఏపీకే ఫైల్స్ క్లిక్ చేస్తే ఇక అంతే
సోషల్ మీడియాల్లో వచ్చే ఏపీకే ఫైల్స్ లింకుల గురించి అవగాహన లేని కొందరు ఆ లింకులను క్లిక్ చేస్తుండడంతో పాటు వాటిని తెలిసిన వారికి ఫార్వర్డ్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ పోస్ట్ చేస్తున్నారు. నిజమని నమ్మి కొందరు ఏపీకే లింకులను ఓపెన్ చేసి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్నారు. దీంతో వారి మొబైల్‌లో ఉన్న సమాచారం, వీడియోలు, ఫొటోలు, బ్యాంకు అకౌంట్లు, మెసేజ్‌లు, వాట్సాప్ సహా స్మార్ట్‌ఫోన్ మొత్తాన్ని హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయిన ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలతో అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు.
ఏపీకే ఫైల్స్ అంటే ఏంటి..?
సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే ఫైల్(.apk) లింకులను ఎట్టి పరిస్థితిలోనూ క్లిక్ చేయొద్దు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ లోనూ కొన్ని యాప్ లు స్కామర్లు సృష్టించినవి ఉంటాయి. స్మార్ట్ ఫోన్‌లోని సెట్టింగ్‌లో ఇన్‌స్టాల్ ఫ్రం అన్‌నోన్ సోర్సెస్(తెలియని వెబ్ సైట్ల నుంచి) అనే ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలి. దీంతో మన అనుమతి లేకుండా యాప్స్ ఇన్‌స్టాల్ కావు. ఏపీకే ఫైల్, మాల్‌వేర్ ఇన్‌స్టాల్ జరిగినట్లు అనుమానం వస్తే మొబైల్ రీసెట్ చేయాలి. ఆ వెంటనే బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన పిన్ నంబర్లు, పాస్‌వర్డులు మార్చుకోవాలి. M KAVACH2 యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని స్కాన్ చేస్తే మొబైల్ డివైజ్ సెక్యూర్‌గా ఉంటుంది.
- విశ్వనాథ్, ఎథికల్ హ్యాకర్, హైదరాబాద్
వెంటనే 1930కి కాల్ చేయాలి..
ఏపీకే ఫైళ్లతో పాటు సోషల్ మీడియా గ్రూపుల్లో వచ్చే లింకులు ఓపెన్ చేస్తే.. ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్తుంది. ఏపీకే వంటి యాప్‌లను ఇన్ స్టాల్ చేస్తే.. ఓటీపీలు చెప్పకున్నా అకౌంట్లు ఖాళీ చేస్తారు. సైబర్ క్రిమినల్స్ బారిన పడిన బాధితులు వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. లేదా http://cybercrime.gov.in ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు.
⚠️ Scam Alert! Messages offering a “personalized” New Year card via links or .apk files can install malware. Don’t click, don’t download—report & block immediately. Stay alert this festive season! 🎁📱 #CyberSecurity #WhatsAppScam pic.twitter.com/GfDw97hGPX
— Hyderabad City Security Council (@HCSC_Hyd) December 31, 2025
