- కేంద్రం కూడా యాక్ట్ తేవాలి
- డెలివరీకి డెడ్‌లైన్ పెట్టి,
- కంపెనీలు పెనాల్టీలు విధిస్తున్నయ్
- మెడికల్ బెనిఫిట్స్, ఇన్సెంటివ్స్ కూడా ఇస్తలేవని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిగ్ వర్కర్లకు అండగా ఉంటామని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. వాళ్ల సంక్షేమం కోసం త్వరలోనే చట్టం తీసుకురానున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా గిగ్ వర్కర్ల చట్టాన్ని తేవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం వర్కర్లు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారని గుర్తు చేశారు. బుధవారం జాతీయ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మంత్రి వివేక్ మాట్లాడారు.
ఈ సందర్భంగా గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. ‘‘ఇన్ని నిమిషాల్లోగా డెలివరీ చేయాలని గిగ్ వర్కర్లకు డెడ్‌లైన్ పెడ్తున్న కంపెనీలు.. ఆ టైమ్‌లోగా డెలివరీ చేయకపోతే పెనాల్టీలు విధిస్తున్నాయి. దీంతో ఆ టైమ్‌లోపు డెలివరీ చేయాలనే ఆత్రుతలో వర్కర్లు యాక్సిడెంట్లకు గురవుతున్నారు. గాయపడితే వారికి కనీసం మెడికల్స్ బెనిఫిట్స్ కూడా లేవు. దీంతో ట్రీట్మెంట్కోసం ఇబ్బందులు పడుతున్నారు.
ఇన్‌టైమ్‌లో డెలివరీ చేయకపోతే ఐడీలు సైతం బ్లాక్ చేస్తున్నారు. ఇన్సెంటివ్స్ కూడా ఇస్తలేరు” అని పేర్కొన్నారు. ‘‘భారత్ జోడో యాత్రలో గిగ్ వర్కర్ల సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు. వాళ్ల సంక్షేమం కోసం చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో చట్టం తెస్తున్నాం. ఇప్పటికే వర్కర్ల యూనియన్లు, కంపెనీలతో చర్చించి డ్రాఫ్ట్ బిల్లు రెడీ చేసి సలహాలు, సూచనలు తీసుకున్నాం. దీనిపై కేబినెట్‌లోనూ చర్చించాం.
ప్రస్తుతం లా డిపార్ట్‌మెంట్ అధ్యయనం చేస్తోంది. త్వరలోనే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం చేస్తాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి యూనియన్లను, కంపెనీలను భాగస్వామ్యం చేస్తాం” అని తెలిపారు.
