- ‘పోలవరం-నల్లమలసాగర్’పై తెలంగాణ ఫిర్యాదులు బుట్టదాఖలు
- పైకి కాదు, కూడదంటూనే.. లోలోపల ..క్లియరెన్సులు ఇచ్చేలా పావులు
- వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే.. అవే లెక్కలు
- పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే డీపీఆర్‌లు వెనక్కి
- గోదావరి వరద జలాలు తరలిస్తే తమ వాటాను ఆపుకుంటామంటున్న ఎగువ రాష్ట్రాలు
- వాటి లెక్కలు, ఎగువ రాష్ట్రాల వాటాలు తేలనప్పుడు ప్రాజెక్ట్ ఎట్లా సాధ్యమనే ప్రశ్నలు
- ఇంటర్ స్టేట్ లొల్లి పెట్టి గోదావరి ట్రిబ్యునల్ ..
- ఏర్పాటు చేసే కుట్ర దాగి ఉందనే ఆందోళన
- ఇదే జరిగితే దొంగదారిలో నీళ్లు మళ్లించుకునేందుకు ఏపీ ప్లాన్
హైదరాబాద్, వెలుగు: గోదావరి జలాలపై కేంద్రం డబుల్గేమ్ఆడుతున్నది. ఏపీ అక్రమంగా చేపడ్తున్న పోలవరం –నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై (పీఎన్‌ఎల్‌పీ) మోదీ సర్కారు అనుసరిస్తున్న తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. పీఎన్‌ఎల్‌పీపై తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఫిర్యాదులు చేసినా మీదికి ఓకే అంటూనే లోపల బుట్టదాఖలు చేస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాలమూరుపై ఏపీ ఫిర్యాదు చేయగానే ప్రాజెక్ట్ డీపీఆర్‌ను వెనక్కి పంపించిన కేంద్రం.. పోలవరం– నల్లమల సాగర్‌పై తెలంగాణ ఫిర్యాదు చేసినా, స్వయంగా సీఎం రేవంత్ లేఖలు రాసినా స్పందించకపోవడం, ఏపీని నిలువరించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వట్లేదు అని బయటికి చెప్తూనే.. లోలోపలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను కానిచ్చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలోనే ఆ ప్రాజెక్టుకు క్లియరెన్సులు ఇచ్చేందుకు హైలెవెల్‌లోనే పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఓవైపు వరద జలాల ఆధారంగా పీఎన్‌ఎల్‌పీకి అనుమతిచ్చేందుకు ప్రయత్నిస్తుండడం, మరోవైపు గోదావరి– కావేరి లింక్‌పై ఎటూ తేల్చకుండా నానుస్తుండడంతో గోదావరిపై ఇప్పటికే ఇంటర్స్టేట్లొల్లి మొదలైంది. ఇది కాస్తా ట్రిబ్యునల్ఏర్పాటుకు ఎక్కడ దారి తీస్తుందోనని తెలంగాణ ఇరిగేషన్వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
పాలమూరుపై ఏపీ ఇట్ల ఫిర్యాదు .. అట్ల డీపీఆర్ వెనక్కి..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు మొదటి నుంచీ పగబట్టినట్టే వ్యవహరించారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆ ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాశారు. గోదావరి డైవర్షన్‌లో ఏపీ తరలించే నీళ్లలో సాగర్‌కు ఎగువన వచ్చే 80 టీఎంసీల్లో తమకూ వాటా ఉంటుందని వితండవాదానికి తెరదీశారు.
ఈ క్రమంలోనే ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కూడా అదే ధోరణితో పాలమూరు ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసింది. దీంతో 2023లో పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్రం వెనక్కి పంపింది. అప్రైజల్ లిస్టు నుంచి తప్పించింది.
ఎన్ని లెక్కలిచ్చినా సంతృప్తి చెందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఇప్పటికీ వివక్ష చూపిస్తూనే ఉన్నది. అదే సమయంలో ‘వరద జలాలపై’ ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం– నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఫిర్యాదులు చేసినా.. ఏవో ఉత్తుత్తి ఉత్తర్వులు, ఉత్తిత్తి మాటలు చెబుతున్నదే తప్ప ప్రాజెక్టును ఆపాలంటూ ఏపీకి ఏనాడూ గట్టిగా చెప్పలేదు. పైగా ఇటు ఏపీ, అటు కేంద్రంలోని కీలక నేతలు హైలెవెల్‌లో చక్రం తిప్పుతూ పోలవరం– నల్లమలసాగర్ లింక్ ఫైలును గుట్టుగా కదుపుతున్నారు. ఈ క్రమంలోనే టెండర్లు కూడా పిలిచినట్లు భావిస్తున్నారు.
వరద జలాల లెక్కలేవి?
పోలవరం దిగువన 790 టీఎంసీల దాకా సముద్రంలోకి కలుస్తున్నాయని సీడబ్ల్యూసీ చెబుతున్నా.. ఇప్పటివరకు శాస్త్రీయమైన హైడ్రాలజీ లెక్కలను కేంద్రం విడుదల చేయలేదు. వరద జలాలెన్ని? మిగులు జలాలెన్ని? నికర జలాలెన్ని? అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. నదిలో పారే ఆ ప్రతి నీటి చుక్కపైనా బేసిన్‌లోని సభ్య రాష్ట్రాలన్నింటికీ వాటి వాటి పరివాహక ప్రాంతాలకు హక్కులుంటాయి.
మరి, ఇప్పటిదాకా వరద జలాలు, మిగులు జలాల లెక్కలే తేల్చనప్పుడు.. ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లో చెప్పనప్పుడు వరదజలాలు లేదా మిగులు జలాల మీద ఏపీ ప్రాజెక్టును ఎట్లా కడుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే పాయింట్‌ను ఎగువ రాష్ట్రాలు కూడా లేవనెత్తుతున్నాయి.
లెక్కలు తేల్చేదాకా ప్రాజెక్టుపై ముందుకు వెళ్లడానికే లేదని స్పష్టం చేస్తున్నాయి. మరి, ఈ జగడం ఇలాగే ముదిరితే.. కృష్ణాలో వేసినట్టే గోదావరి నదీ జలాలపైనా ట్రిబ్యునల్ వేయాల్సి వస్తుందన్న అభిప్రాయాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రం జాతీయ స్థాయిలో చేపట్టిన గోదావరి– కావేరి నదుల అనుసంధానంలోనూ సభ్య రాష్ట్రాలూ గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇచ్చంపల్లి నుంచి చేపట్టాలనుకుంటున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో చత్తీస్‌గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశాలతో పాటు ఏపీ అడ్డుపుల్లలు వేస్తున్నాయి. ఇప్పటికే చేపడ్తున్న పోలవరం– నల్లమలసాగర్ లింక్ ద్వారా సోమశిలకు అక్కడి నుంచి కావేరికి తరలించాలని డిమాండ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గోదావరి ట్రిబ్యునల్‌కు దారితీసే కారణాల్లో ఇదీ ఒకటవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అడ్డదారిలో గోదావరి జలాల దోపిడీకి బాటలు వేసుకునేందుకు ఏపీ చేసిన ట్రిబ్యునల్ డిమాండ్‌కు కేంద్రం సహకరిస్తున్నట్టుగా చర్చ జరుగుతున్నది. ఒక్కసారి ట్రిబ్యునల్ పడిందంటే ఏండ్లకేండ్లు వాదనలు సాగదీసి.. దొడ్డిదారిలో గోదావరి జలాలను చెరబట్టాలనే కుట్రలకు ఏపీ పాల్పడుతున్నదనే వాదనలు విని పిస్తున్నాయి.
వరద జలాలపై ప్రాజెక్టులు లేవంటూనే..
వరద జలాల ఆధారంగానే పోలవరం –నల్లమలసాగర్ ప్రాజెక్టును కడుతున్నామని ఏపీ చెప్పడంతో.. అసలు వరద జలాల ఆధారంగా ఏ ప్రాజెక్టులూ ఉండవని సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్ల్యూసీ) పేర్కొన్నది. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ (పీఎఫ్‌ఆర్)కూ ఆమోదం తెలపలేదని చెప్పింది. కానీ ఇంటర్నల్‌గా మాత్రం ఆ వరద జలాలపైనే సీడబ్ల్యూసీ లెక్కలు తీయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
2025 జులైలోనే పోలవరం స్పిల్ వే నుంచి దిగువకు సముద్రంలో కలిసే నీళ్ల లెక్కలు తీసిన సీడబ్ల్యూసీ.. జులై నుంచి అక్టోబర్ మధ్య లక్ష క్యూసెక్కుల కన్నా ఎక్కువ వరద వస్తే 790 టీఎంసీలు, జులైలో 3 లక్షల క్యూసెక్కులు, ఆ తర్వాత లక్ష క్యూసెక్కుల చొప్పున ఉంటే 418 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఏపీ తరలించాలనుకుంటున్న 200 టీఎంసీల కన్నా ఎక్కువే వరద జలాలు ఉన్నాయని కంప్లయన్స్ రిపోర్టు ఇచ్చింది.
కాగా, 2025 మేలో కేంద్ర జలశక్తి శాఖకు ఎన్‌డబ్ల్యూడీఏ, సీడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం అసలు మిగులు జలాలన్నవే లేవు. 157 టీఎంసీల లోటు ఉన్నట్టు తేల్చి చెప్పాయి. అలాంటప్పుడు వరద జలాల లెక్కలను ఎట్లా తీస్తారని, ఆ లెక్కలే తేలనప్పుడు ఎవరికి అన్యాయం చేస్తారని బేసిన్‌లోని ఇతర రాష్ట్రాలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నాయి.
ఎగువ రాష్ట్రాల నుంచి పెరుగుతున్న డిమాండ్లు..
ఏపీ పోలవరం– నల్లమలసాగర్ ప్రాజెక్ట్ పీఎఫ్‌ఆర్‌పై ఇప్పటికే తెలంగాణసహా ఎగువ రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం తెలియజేశాయి. గోదావరి జలాలను కృష్ణాలో కలిపితే.. బచావత్ అవార్డు ప్రకారం ఎగువన తాము వాడుకుంటామని కర్నాటక, మహారాష్ట్ర తేల్చి చెప్పాయి.
80 టీఎంసీల గోదావరి నీళ్లను కృష్ణాకు తరలిస్తే.. ఆ వాటా మేరకు సాగర్ ఎగువన రాష్ట్రాలు వాడుకునేందుకు బచావత్ ట్రిబ్యునల్ వెసులుబాటు కల్పించింది. ఆ లెక్కన తెలంగాణ 45 టీఎంసీలు (56.25%), కర్నాటకకు 21 టీఎంసీలు (26.25%), మహారాష్ట్రకు 14 టీఎంసీలు (17.50%) చొప్పున కేటాయింపులున్నాయి.
ఈ ప్రకారం చూసినప్పుడు పోలవరం –నల్లమలసాగర్ ద్వారా తరలించే 200 టీఎంసీల్లోనూ తెలంగాణకు 112.50 టీఎంసీలు, కర్నాటకకు 52.50 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీల చొప్పున నీళ్లు రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎగువనే తాము నీటిని ఆపుకుంటామని ఇప్పటికే కేంద్రానికి కర్నాటక, మహారాష్ట్ర స్పష్టం చేశాయి.
