- ఒక్కో ఆర్డర్‌కు రూ.120 నుంచి 150
- సమ్మె ఆపాలని అమితాబ్ బచ్చన్‌తో వీడియోలు
- దేశవ్యాప్తంగా శాంతియుతంగా ముగిసిన సమ్మె..
- పాల్గొన్న లక్షా 75 వేల మంది
- సొంత సిబ్బందితో డెలివరీ చేసిన రెస్టారెంట్లు
- దాడులు జరగకుండా బౌన్సర్ల ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు:గిగ్ వర్కర్లు బుధవారం దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెతో ఫుడ్ డెలివరీ కంపెనీలు స్విగ్గీ, జొమాటో దిగొచ్చాయి. న్యూఇయర్ టైమ్‌లో తమ సర్వీసుల్లో అంతరాయం లేకుండా ఉండేందుకు గిగ్ వర్కర్లకు ఇన్సెంటివ్స్ ప్రకటించాయి. సమ్మెలో పాల్గొనకుండా డెలివరీ చేస్తే ఒక్కో ఆర్డర్‌కు రూ.120 నుంచి రూ.150 చెల్లిస్తామని బంప్ ఆఫర్ ఇచ్చాయి. రోజుకు రూ.3 వేలు సంపాదించుకోవచ్చని జొమాటో చెబితే.. డిసెంబర్ 31, జనవరి 1 రెండ్రోజుల్లో కలిపి రూ.10 వేలు సంపాదించుకోవచ్చని స్విగ్గీ తెలిపింది.
అయితే, బుధవారం దేశవ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణలోనూ గిగ్ వర్కర్లు సమ్మెకు దిగారు. దీంతో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో లాంటి ప్లాట్‌ఫామ్‌ల సేవలకు అంతరాయం కలిగింది. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో దేశవ్యాప్తంగా డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌కు పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. వర్కర్లు సమ్మెలో ఉండటంతో రెస్టారెంట్లు తమ సిబ్బందితో ఆర్డర్లను డెలివరీ చేయిస్తున్నాయి.
రెస్టారెంట్ల వద్ద గొడవలు జరగకుండా రోజుకు రూ.10 వేలు ఇచ్చి బౌన్సర్లను నియమించుకున్నాయి. డెలివరీ పార్ట్నర్లకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కస్టమర్లకు స్విగ్గీ సూచించింది. ఈ అంశంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది.
సాధారణ రోజుల్లో రూ.20
గిగ్ వర్కర్లను డెలివరీ కంపెనీలు దోచుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంత దూరం డెలివరీ ఉన్నా, ఎంత పెద్ద అమౌంట్ ఆర్డర్ ఉన్నా కంపెనీలు రూ.20లోపే చెల్లిస్తున్నాయని వర్కర్లు వాపోతున్నారు. ఒక్కో ఆర్డర్‌పై మినిమం రూ.8, మ్యాగ్జిమం రూ.20 వరకు చెల్లిస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు తాము సమ్మెలో ఉండడం.. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో భారీగా ఆర్డర్లు రావడంతోనే ఒక్కో దానిపై రూ.150 చెల్లిస్తామని కంపెనీలు ఆఫర్ ప్రకటించాయని పేర్కొన్నారు.
సినీ ప్రముఖులతో వీడియోలు..
దేశవ్యాప్తంగా లక్షా 75 వేల మంది గిగ్ వర్కర్లు బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. వీళ్లు గత నెల 25న సమ్మె చేసినప్పటికీ, కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బుధవారం మళ్లీ సమ్మె చేపట్టారు. గిగ్ వర్కర్ల మీద పని ఒత్తిడి, ఇన్సెంటివ్స్ ఇవ్వకపోవటం, 10 నిమిషాల్లో డెలివరీ చేయడం, జరిమానాలు, ఐడీలు బ్లాక్ చేయడం తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం కంపెనీలతో చర్చలు జరిపి గిగ్ వర్కర్ల సంక్షేమంపై గైడ్ లైన్స్ ఖరారు చేయాలని కోరుతున్నారు. ఈ గైడ్ లైన్స్ ను కంపెనీలు కచ్చితంగా అమలు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వర్కర్లు సమ్మెను ఆపాలంటూ అమితాబ్ బచ్చన్, తమన్నా లాంటి సినీ ప్రముఖులతో కంపెనీలు వీడియోలు విడుదల చేయించాయి. వాళ్లకు రూ.కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చి ప్రకటనలు చేయించే బదులు.. అదే అమౌంట్‌ను తమకు ఇస్తే బాగుంటుందని గిగ్ వర్కర్లు అంటున్నారు.
గిగ్ వర్కర్ల శ్రమను కంపెనీలు దోచుకుంటున్నయ్..
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు చేపట్టిన సమ్మె శాంతియుతంగా ముగిసింది. గిగ్ వర్కర్ల శ్రమను కంపెనీలు దోచుకుంటున్నాయి. ప్రతి ఆర్డర్‌పై ఇచ్చే పేమెంట్లను నిరంతరం తగ్గిస్తున్నాయి. అతి తక్కువ సమయంలో డెలివరీ చేయాలనే ఒత్తిడి వల్ల డెలివరీ బాయ్స్ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. సమ్మెను నీరుగార్చడానికి జొమాటో వంటి కంపెనీలు రోజుకు రూ.3 వేల వరకు సంపాదించుకోవచ్చ ని ప్రకటనలు ఇచ్చాయి. ఇది కేవలం కార్మికుల ను తప్పుదోవ పట్టించే ప్రచారమే. గిగ్ వర్కర్ల సంక్షేమానికి కేంద్రం వెంటనే చట్టం తేవాలి.
- సలావుద్దీన్, వ్యవస్థాపక అధ్యక్షుడు, గిగ్ వర్కర్ల యూనియన్ -
