ఒక మార్కు తేడా.. కష్టపడి చదివిన చదువుకు దక్కిన నిరాశ.. ఎన్నో ఆశలతో డాక్టర్ కావాలన్నా కలలు.. ఒక్కసారిగా కరిగిపోవడంతో ఆ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురయ్యింది. కనీస అర్హత మార్కులకి కేవలం 11 మార్కులు తక్కువ రావడంతో తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్న హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో కలకలం రేపింది.
కర్జత్ తాలూకా జలాల్‌పూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతికి వైద్యురాలై పేదలకు సేవ చేయాలన్నదే జీవితాశయం. ఇందుకోసం ఆమె పగలు, రాత్రి అనకుండా నీట్ పరీక్ష కోసం కష్టపడి చదివింది. మే 3న తొలి విడత నీట్ పరీక్ష రాసిన ఆమె.. ఆ తర్వాత మారిన షెడ్యూల్ ప్రకారం జూన్ 21న రీ-ఎగ్జామ్ కూడా హాజరైంది. ఎలాగైనా 300కు పైగా మార్కులు తెచ్చుకుంటానని ఎంతో ధీమాగా ఉంది.
కానీ, విధి మరోలా తలచింది. ఫలితాలు వచ్చిన రోజు ఆమె ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఆమెకు కేవలం 166 మార్కులు మాత్రమే వచ్చాయి. నీట్‌లో అర్హత సాధించడానికి 177 మార్కులు రావాల్సి ఉండగా.. సరిగ్గా 11 మార్కులు తక్కువ రావడంతో తీవ్ర నిరాశకు గురైంది.
శనివారం సాయంత్రం.. తండ్రి, సోదరుడు ఆషాఢ ఏకాదశి దర్శనం కోసం పండర్‌పూర్‌కు వెళ్లగా, తల్లి ఇంట్లో పనుల్లో బిజీగా ఉన్నప్పుడు... ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తన స్టడీ రూమ్‌లోకి వెళ్లిన విద్యార్థిని.. లోపల తలుపు వేసుకుని ప్రాణాలు విడిచింది. చాలా సేపటి వరకు గదిలో ఎలాంటి శబ్దం కాకపోవడంతో కంగారుపడిన తల్లి వచ్చి తలుపు తెరిచి చూసేసరికి జరిగిన విషాదం ఆమెను గుండెలు బాదేలా చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె గదిలో సోదా చేయగా దొరికిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది.
అందులో ఆమె.. "నీట్‌లో ఆశించిన మార్కులు రాకపోవడంతో నేను తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. డాక్టర్ కావాలన్న నా కల కలగానే మిగిలిపోయింది. నా మరణానికి నా తల్లిదండ్రులను, సోదరుడిని బాధ్యులు చేయవద్దు.." అంటూ రాసింది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల విధానం, విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి, నిత్యం తలెత్తుతున్న వివాదాలు ఎంతోమంది నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. రేపటి భవిష్యత్తుగా నిలవాల్సిన యువత ఇలా చిన్న చిన్న వైఫల్యాలకే కుంగిపోయి ప్రాణాలు తీసుకోవడం సమాజాన్ని కలచివేస్తుంది.
